హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.704.50 కోట్ల వ్యయంతో జిల్లా పోలీస్ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్లు, భవనాల నిర్మాణం చేపట్టినట్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. కార్పొరేషన్ ఎండీ ఐపీఎస్ రాజీవ్ రతన్తో కలిసి ఆయన బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, ఆలోచనలకు అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో పోలీసు భవనాలను కార్పొరేట్ కార్యాలయాలకు తీసిపోని విధంగా నిర్మిస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో 51వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 23 జిల్లా పోలీస్ కార్యాలయాల భవనాలు, సిద్దిపేట, కామారెడ్డి, రామగుండం, వరంగల్ పోలీస్ కమిషనరేట్ల నిర్మాణాలను చేపట్టినట్టు తెలియజేశారు. రాష్ట్రంలోని 90 పోలీస్ స్టేషన్లలో ఫ్రంట్ ఆఫీస్ నిర్మాణం పనులు చేపట్టగా, ఇందులో 78 పనులు పూర్తికాగా, మిగిలిన పనులు దాదాపుగా పూర్తికా వస్తున్నాయని అన్నారు. జిల్లా పోలీస్ అధికారుల భవనాలను ఒకొకటి రూ.38.50 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.