హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్హెచ్ఏ) మంగళవారం అటు ప్రభుత్వం నుంచి ఇటు పోలీస్ ఉన్నతాధికారులు, ఆరోగ్య భద్రతా కార్యదర్శి సమక్షంలో జరిపిన చర్చలు సత్ఫలితాన్ని ఇచ్చాయి. దీంతో బుధవారం నుంచి పోలీస్ ఆరోగ్య భద్రతా వైద్యసేవలు యథావిథిగా కొనసాగనున్నాయి. ప్రతినెలా భద్రతకు, ఆరోగ్య భద్రతకు కలిపి రూ.1,600 (కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ), రూ.3,200 (ఎస్సై నుంచి పైర్యాంకు అధికారులు) నగదు చెల్లిస్తున్నా.. వైద్యం అందకపోవడంపై పోలీసు కుటుంబాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
20లోపు పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే వైద్యం చేసేది లేదని టీఎస్హెచ్ఏ ఆరో తేదీనే హెచ్చరించినా ముందస్తు చర్చలే జరపలేదు. వారు డెడ్లైన్ పెట్టిన నాటినుంచి ఆయా దవాఖానలు పోలీస్ ఆరోగ్య భద్రత సేవలను నిలిపివేశాయి. మరికొన్ని దవాఖానలు ఆరోగ్య భద్రత కింద అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఆరోగ్య భద్రత కింద పోలీసు కుటుంబాలు పడుతున్న ఇబ్బందులపై, డెడ్లైన్ ముగిసిపోతున్నా చలనంలేని ప్రభుత్వ తీరుపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించింది. దీంతో పోలీస్ ఆరోగ్య భద్రత కింద వైద్యం చేసుకుంటున్న పోలీస్ కుటుంబాలెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని డీజీపీ జితేందర్ ‘నమస్తే తెలంగాణ’కు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సచివాయలంలో జరిపిన చర్చలు సత్ఫలితాన్ని ఇచ్చాయి. పోలీసు ఆరోగ్య భద్రత కింద సుమారు రూ.300 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఆయా దవాఖానలకు చెల్లించాల్సి ఉన్నది.
తెలంగాణ ఆరోగ్య భద్రత కింద నగదు రహిత వైద్యసేవలను యథావిధిగా కొనసాగించనున్నట్టు తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్హెచ్ఏ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 20న డీజీపీ జితేందర్ రాసిన లేఖ ఆధారంగా జరిపిన చర్చలు సత్ఫలితాన్ని ఇచ్చాయని అసోసియేషన్ పేర్కొన్నది. భారీ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని తెలిపింది. ఈ మేరకు టీఎస్హెచ్ఏ అనుబంధ దవాఖానలు వైద్యం అందించాలని అసోసియేషన్ కోరింది. సమస్యల పరిష్కారానికి ఆరోగ్య భద్రత సిబ్బందితోపాటు టీఎస్హెచ్ఏ ఎక్స్కాం సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ఆరోగ్య భద్రత సేవల పునరుద్ధరణకు సహకరించిన డీజీపీ జితేందర్ సహా పలువురికి పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపీరెడ్డి, నాయకులు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. 20 నుంచి కొన్ని దవాఖానలు వైద్య చికిత్సలను నిలిపివేశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో డీజీపీ హాస్పిటల్స్ అసోసియేషన్తో సంప్రదింపులు జరిపారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులకు, భద్రత కార్యదర్శికి కూడా ధన్యవాదాలు తెలిపారు.