కోరుట్ల, మార్చి 5: పోలీసుశాఖకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్‌పల్లి శివారు మామిడి తోట లో గత నెలలో పేకాట ఆడుతూ ఎనిమిది మంది పట్టుబడ్డారు. వీరి వద్ద రూ.23 వేల నగదు స్వాధీనం చేసుకున్న స్పెషల్ బ్రాంచి పోలీసులు, కోరుట్ల పట్టణ ఠాణాకు కేసును బదిలీ చేశారు.
కోరుట్ల పట్టణ మూడో ఎస్ఐ శంకర్ దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం ఏడుగురికి సెల్ఫోన్లను తిరిగి ఇచ్చా రు. రాయికల్ మండలం ఉప్పుమడుగుకు చెందిన బండారి శ్రీనివాస్‌కు రూ.5వేలు ఇస్తేనే ఫోన్ ఇస్తానని చెప్పాడు. దీంతో శ్రీనివాస్, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ శంకర్‌కు బాధితుడు శ్రీనివాస్ రూ.5వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.