హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన గిబ్లీ ఫొటోను స్మితాసబర్వాల్ రీపోస్ట్ చేశారు. సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ రాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫొటో అంటూ అభియోగాలు మోపారు. ఈ మేరకు బీఎన్ఎస్ 179 సెక్షన్ కింద పోలీసులు నోటీసులు అందించారు.
ఐఏఎస్ ఆఫీసర్లకు నోటీసులా?: అనూష రవిసూద్, సౌత్‌ఫస్ట్ ఎడిటర్
ఐఏఎస్ ఆఫీసర్ స్మితాసబర్వాల్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సౌత్‌ఫస్ట్ ఎడిటర్ అనూష రవిసూద్ ‘ఎక్స్’ వేదికగా ఖండించారు. హెచ్‌సీయూ అంశంపై గిబ్లీ ఫొటోను రీపోస్ట్ చేసినందుకు ఐఏఎస్ అధికారికి తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేయడం సరికాదని చెప్పారు. ఏఐతో రూపొందించిన ఫొటోలపై నోటీసులు ఇవ్వడం, కేసు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. వ్యగ్యంగా కార్టూన్లు వేశారని కార్టూనిస్టులపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి కేసులు పెడతారా? అని మండిపడ్డారు.