నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 5: టీజీపీఎస్సీ నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ముం దస్తు అరెస్టులు చేపట్టారు. నిరుద్యోగులు, బీఆర్ఎస్, యువజన, విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే నాయకుల ఇండ్లలోకి వెళ్లి అరెస్ట్ చేశారు.
నిరుద్యోగులు, బీఆర్ఎస్ నేతలతో పోలీస్స్టేషన్లు నిండిపోయాయి. అయినా నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడికి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 80 మందికి పైగా విద్యార్థి నేతలు, నిరుద్యోగులను స్టేషన్లకు తరలించారు.
సూర్యాపేట, చివ్వెంల, నాగారం, తుంగతుర్తి, తిరుమలగిరి, మేళ్లచెరువు, మఠంపల్లి తదితర మండలాల్లో గురువారం సాయంత్రం నుంచే నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులకు ఫోన్లు చేసి స్టేషన్‌కు రావాలని హుకూం జారీ చేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఇండ్లల్లోకి వెళ్లి స్టేషన్‌కు తీసుకువచ్చి బైండోవర్ చేశారు. నల్లగొండ జిల్లాలో కట్టంగూర్, శాలిగౌరారం, కొండమల్లేపల్లి మండలాల్లోనూ అరెస్టులు కొనసాగాయి. భద్రాద్రి జిల్లాలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆమె శాంతినగర్‌లోని తన నివాసంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తర్వాత మరిచిందని విమర్శించారు. మోసపూరిత మాటలను నమ్మి కాంగ్రెస్‌కు ఓటేసిన వారే ఇప్పుడు ఆగ్రహానికి గురవుతున్నారని, వారు మర్లబడితే కుర్చీని వదిలేసి వెళ్లి పోవాల్సి వస్తుందని ఉష హెచ్చరించారు.