హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసు లు ఓవరాక్షన్ చేశారు. దివ్యాంగుడని కూడా చూడకుండా దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డిని తోసేయడంతో ఆయన కిందపడిపోయారు. అయినా కనికరం లేకుండా పోలీసులు ఈడ్చుకెళ్లడంతో గా యాలు కాగా, పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ అధికారులు జూబ్లీహి ల్స్ పోలీస్‌స్టేషన్‌లో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ను విచారిస్తున్న సందర్భంగా వాసుదేవరెడ్డిని లైవ్ బులెటిన్‌లో మాట్లాడాల్సిందిగా మీడియా ప్రతినిధులు కోరారు. అప్పటికే అక్కడున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు తాడుతో లాగేశారు.
లైవ్‌లో ఉండగానే రెండు నిమిషాలు మాట్లాడుతానని వాసుదేవరెడ్డి పోలీసులను బతిమాలినా వినలేదు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్న క్రమంలోనే రెక్కలు పట్టి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన్ని చుట్టుముట్టి తీసుకెళ్తున్న పోలీసులు గట్టిగా తోసేయడంతో కిందపడిపోయారు. దీంతో తారురోడ్డుపై పడటంతో మోచేయి, కాలికి, వీపులో గాయాలయ్యాయి. ప్రజాపాలన పేరుకేనని తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని, ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై ‘ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబులిటీస్ యాక్ట్-2016’ ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డిని సైతం పోలీసులు అలాగే ఈడ్చిపారేశారు.