ఖైరతాబాద్, నవంబర్ 26 : తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి సభను డిసెంబర్ 1న గన్‌పార్క్ వద్ద నిర్వహిస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండా ప్రకాశ్ ముదిరాజ్ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ నెలకు ఎంతో ప్ర త్యేకత ఉన్నదని, 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. శ్రీకాంతాచారి ఆత్మహత్యకు యత్నించి, దవాఖానలో చికిత్స పొందుతున్న తరుణంలో చలించిపోయిన పోలీసు కిష్టయ్య డిసెంబర్ 1న తన స ర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మబలిదానం అయ్యారని చెప్పారు. 19ఏండ్ల సర్వీసులో 17 సార్లు పోలీసుశాఖ ద్వారా ప్రశంసలు, అవార్డులు పొందిన కిష్టయ్య తెలంగాణ ఆకాంక్ష నె రవేరాలన్న సంకల్పంతో అమరత్వం పొందాడని కొనియాడారు.
డిసెంబర్ 3న శ్రీకాంతాచారి మరణించాడని, తొలి అమరుడిగా కిష్టయ్యను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2014 నుంచి ఏటా గన్‌పార్క్‌లో వర్ధంతి కా ర్యక్రమాలను తమ సంఘం ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. కిష్టయ్య కుటుంబానికి ఇంటి స్థలంతోపాటు ఆర్థిక సాయం చేశారని తెలిపారు. కిష్టయ్య కుమారుడికి నిజామాబాద్‌లో, ఆయన సతీమణికి కరీంనగర్లో ఉద్యోగం ఇప్పించారని, ఆయన బిడ్డను మెడిసిన్ చదివించారని, త్వరలోనే ఆమె పీజీ పూర్తి చేసి వైద్యసేవలందించనున్నారని తెలిపారు. ప్రభుత్వం పోలీసు కిష్టయ్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రతిష్టించాలని కోరారు. కిష్టయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ పోస్టర్లను ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు భద్రమౌని యాదగిరితో కలిసి ఆవిష్కరించారు.