హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం గత రెండున్నర ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర పోలీస్ విభాగంలో 17 వేల ఖాళీలను భర్తీ చేయాలని మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి సమర్పించిన విజ్ఞాపనను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకే ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినట్టు విశ్వనీయంగా తెలిసింది. ఇదే విషయాన్ని డీజీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో సూత్రప్రాయంగా వెల్లడించారు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అధికారంలోకి రాకముందు ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2016, 2018, 2022లో కనీసం 16 వేలకు తగ్గకుండా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. అలా కేసీఆర్ హయాంలో మొత్తం 48,096 పోలీస్ ఉద్యోగాలు ఇప్పించారు. 2022లో విడుదలైన భారీ నోటిఫికేషన్ కేసీఆర్ హయాంలోనే పూర్తయింది. ఆ తర్వాత కేవలం అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ 17,516 ఉద్యోగాలను కూడా తాము ఏటా ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాల ఖాతాలో వేసుకున్నారు. 2022 ఏప్రిల్ నుంచి నేటి వరకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఒక్క పోలీస్ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు విడుదల చేస్తారేమోనని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ఎస్ఐబీ, గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న సిబ్బందిని ఆ ఖాళీల్లో గ్రేహౌండ్స్, ఎస్ఐబీ సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో మావోయిస్టులను నిర్మూలించేందుకు ‘గ్రేహౌండ్స్’ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాడు గ్రేహౌండ్స్‌లో 3 వేల మంది వరకూ సిబ్బంది ఉండగా.. నేడు ఆ సంఖ్య 1,000కి తగ్గింది. ఎస్ఐబీలో మొత్తం 250 మంది కూడా సిబ్బంది లేరు. లొంగిపోయిన మావోయిస్టులపై నిఘా పెట్టేందుకు ఎస్ఐబీ ఉండాల్సిందే. రాష్ట్రంలో మావోయిస్టులను ఇప్పటికీ పూర్తిస్థాయిలో నిర్మూలించనందున గ్రేహౌండ్స్ అవసరం కూడా ఉన్నది. అయినప్పటికీ వీరిని ఇతర విభాగాలకు పంపే వంకతో ప్రభుత్వం నేటికీ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు. ఎస్బీఐ, గ్రేహౌండ్స్ నుంచి దాదాపు 700 మంది సిబ్బందిని ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు పంపాలని భావిస్తున్న ప్రభుత్వం మిగిలిన 16 వేల పైచిలుకు పోలీస్ ఉద్యోగాల భర్తీని కావాలనే పెండింగ్‌లో పెడుతున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం శోచనీయం. దీంతో అప్పులు చేసి మరీ దిల్సుఖ్నగర్ లాంటి ప్రాంతాల్లో ఏండ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి 20 వేల పోస్టులతో మెగా పోలీసు నోటిఫికేషన్‌ను విడుదల చేయాలి. నోటిఫికేషన్ల జాప్యం వల్ల నష్టపోతున్న అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలి. న్యాయమైన ఈ డిమాండ్లను పరిషరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం.