CI Nageshwar Reddy | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : అతనో పోలీసు ఉన్నతాధికారి. స్టేషన్లో కేసులు డీల్ చేయడం తెలిసిన ఆయన.. కన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకోలేకపోయాడు. పైగా.. కని, పెంచి, ఓ ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రులనే అధికార మదంతో చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. అన్నయ్య తప్పుడు వ్యవహారం తెలిసిన తమ్ముడు.. మంచి పద్ధతి కాదని వారించి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినా.. కఠిన ఖాకీ హృదయం చలించలేదు. విసిగివేసారిన ఆ తల్లిండ్రులు ఏకంగా పోలీస్ బాస్‌ను కలిసి తమ మొర ఏకరువు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం, వెంకటాయింపల్లికి చెందిన రఘునాథ్‌రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు నాగేశ్వర్‌రెడ్డి రాచకొండ కమిషనరేట్‌లో ఓ స్టేషన్ సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
రఘునాథ్‌రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమిలో.. పెద్దకొడుకు పేరున 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరున 11 ఎకరాలు పట్టాచేశాడు. మిగిలిన భూమిని కూతుళ్లకు ఇచ్చేందుకు తమ పేరున ఉంచుకున్నారు. ఈ భూమిపై పెద్దకొడుకు, సీఐ నాగేశ్వర్‌రెడ్డి కన్ను పడింది. తోబుట్టువులకు తానే దగ్గరుండి పంచాల్సింది పోయి, ఆ భూమిని కొట్టేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. తన పేరున ఇంకో 5 ఎకరాలు పట్టా చేయాలని వృద్ధులైన తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ పలుమార్లు దాడి చేశాడు. పెద్ద కొడుకు వేధింపులు తాళలేక చిన్న కొడుకు యాదయ్య ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాలన్నీ డీజీపీ జితేందర్‌కు ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ మొరపెట్టుకున్నారు. తన కొడుకు నాగేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ విషయంపై విచారణ చేయిస్తామని, ఇబ్బంది లేకుండా చూస్తామని డీజీపీ వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది.
బాలికను నిర్బంధించి లైంగికదాడి
బేగంపేట్ ఆగస్టు 5: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరింపులతో నిర్బంధించి లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై హైదరాబాద్ బేగంపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బేగంపేటలో నివసించే ఓ వ్యక్తి ఆదివారం సాయంత్రం విధుల కోసం ఇంటి నుంచి బయట కు వెళ్లాడు. ఇంట్లో అతని కూతురు (15) ఒంటరిగా ఉన్నది. పనులు ము గించుకొని ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి త లుపు మూసి ఉండటంతో తలుపుతట్టాడు. ఎవరూ తీయకపోవడంతో బలవంతంగా నెట్టాడు. ఇంట్లో నుంచి సోనూ(20) అనే యువకుడు అతన్ని నెట్టుకుంటూ బయటకు పరుగుతీశా డు. ఏం జరిగిందని ఇంట్లో ఉన్న తన కూతురును ఆరా తీశాడు. తన నోట్లో గుడ్డలు కుక్కి నిర్బంధించి లైంగికదాడికి పాల్పడ్డట్టు ఆమె తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.