హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి అడ్డంగా దొరికిన ఢిల్లీ బీజేపీ దూతలు చంచల్‌గూడ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ను శనివారం రాత్రి పోలీసులు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. జైలు అధికారులు ఈ ముగ్గురినీ వేర్వేరు బ్లాక్‌లకు తరలించారు. ఢిల్లీ బీజేపీ పెద్దల ఆదేశాల మేరకే నిందితులు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే భారీ కుట్ర పన్నినట్టు పోలీసులు గుర్తించారు. లోతైన దర్యాప్తు జరిపేందుకు సన్నద్ధం అవుతున్నారు. నిందితులను కస్టడీ కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి.
చాటింగ్ నంబర్లపై ఆరా
వాట్సాప్ ద్వారా రామచంద్రభారతి, నందకుమార్‌లు పలువురితో వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఇందులో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం జరిగిన సంభాషణలను పోలీసులు సేకరించారు. వారి ఫోన్ల నుంచి సేకరించిన సమాచారంలో ఎమ్మెల్యేల కొనుగోలు, డబ్బుకు సంబంధించిన విషయాలు ఉన్నట్టు సమాచారం. నిందితులు అవతలవైపు ఎవరితో సంభాషించారు? ఫోన్ నంబర్లు ఎవరివి? ఎవరెవరికి సమాచారం ఫార్వర్డ్ అయ్యింది? అనే అంశాలపై దృష్టిసారించారు. సాంకేతికంగా వాటిని నిర్ధారించుకున్న పోలీసులు, నిందితులను కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారాన్ని సేకరించేందుకు సన్నద్ధమవుతున్నారు.