హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. పబ్బులు, హోటళ్లు, క్లబ్‌లకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం మార్గదర్శకాలు ప్రకటించారు. న్యూ ఇయర్ పార్టీల్లో బహిరంగ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని, పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దని ఆదేశించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొవిడ్ రూల్స్ అతిక్రమించినా చర్యలుంటాయని, ఈవెంట్లకు పరిమితి మించి పాసులు విక్రయించొద్దని సూచించారు. ఈవెంట్లలో జనాల్లోకి సింగర్స్ వెళ్లొద్దన్నారు. రెండు డోసుల టీకా తీసుకున్న వారికే వేడుకలకు అనుమతి ఇవ్వాలని, వేడుకల్లో మాస్క్‌లు లేకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. వేడుకల్లో భౌతికదూరం పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, వేడుకలకు రెండు రోజుల ముందు అనుమతి తీసుకోవాలని ఆదేశించారు.
సిబ్బందికి 48 గంటల ముందు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయాలన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే ఆరు నెలల జైలు, రూ.10వేల జరిమానా తప్పదన్నారు. అసభ్యకరంగా దుస్తులు ధరించినా, నృత్యాలు చేసినా చర్యలుంటాయని స్పష్టం చేశారు. వేడుకల్లో మాదకద్రవ్యాలకు అనుమతి ఇస్తే చట్టరీత్యా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మహిళలపై వేధింపుల కట్టడికి షీ బృందాలతో నిఘా వేయనున్నట్లు తెలిపారు.