మన్సూరాబాద్, జనవరి 28: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు, గొడవలతో భర్తే క్రూరంగా హత్య చేసినట్టు నిర్ధారించారు. సాంకేతిక, నిందితుడు వెల్లడించిన ఆధారాలతో గురుమూర్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్‌బాబు మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం, జెల్లివారి పుల్లల చెరువు గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తి (39), పుట్ట వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురుమూర్తి 15ఏండ్లపాటు ఆర్మీలో జవాన్‌గా పనిచేశారు.
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జిల్లెల్గూడ, న్యూ వెంకటేశ్వరకాలనీలో నివాసముం టూ కంచన్‌భాగ్‌లోని డీఆర్డీఎల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కొన్నిరోజులుగా గురుమూర్తి, వెంకట మాధవి తరచూ గొడవ పడేవారు. అందుకు సంక్రాంతి పండుగను ఎంచుకున్నాడు. ఈనెల 14న డ్యూటీ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన గురుమూ ర్తి, భార్యా పిల్లలను తన సోదరి సుజాత నివాసముండే బడంగ్‌పేట్‌కు వెళ్లాడు. రాత్రి ఒక్కడే ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు సోదరి ఇంటికి వెళ్లి పిల్లలను ఇక్కడే ఉంచి, రాత్రి భార్యను తీసుకొని ఇంటికి వచ్చాడు. 16న ఉదయం వెంకట మాధవితో గొడవపడ్డాడు.
ఆగ్రహంతో వెంకట మాధవిని తీవ్రంగా కొట్టిన గురుమూర్తి.. గొంతు నులిమి చంపాడు. ఇంట్లో ఉన్న కత్తితో భార్య కాళ్లు, చేతులతోపాటు శరీర భాగాలను విడదీసి వాటర్ హీటర్‌లో పెట్టి వేడి చేశాడు. అనంతరం పెద్ద స్టవ్‌పై మంటలో కాల్చి, ఎముకలను పౌడర్‌గా మార్చి టాయ్లెట్లో వేశాడు. మిగిలిన శరీర భాగాలను తీసుకెళ్లి జిల్లెలగూడ పెద్దచెరువులో వేశాడు. తిరిగి ఇంటికి వచ్చిన గురుమూర్తి.. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటిని శుభ్రం చేశాడు. సోదరి ఇంటికి వెళ్లి పిల్లలను తీసుకురాగా, తల్లి ఎక్కడా అని అడిగిన పిల్లలకు పని మీద బయటికి వెళ్లిందని నమ్మించాడు. రెండ్రోజుల అనంతరం వెంకట మాధవి తల్లిదండ్రులు వచ్చి తమ కూతురు ఎక్కడా నిలదీయగా, చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపాడు. దీంతో వెంకటమాధవి తల్లి సుబ్బమ్మ కూతురు అదృశ్యంపై 18న మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంకట మాధవి అదృశృంపై గురుమూర్తిని పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు పిలిచారు. వెంకట మాధవిని హత్యచేసి, ఆమె శరీర భాగాలను జిల్లెల్గూడ చెరువులో వేసిన విషయాన్ని విచారణకు వెంట వచ్చిన అతని మేనమామ తెలిపాడు. ఈ విషయాన్ని నిందితుడి మేనమామ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పోలీసులు సేకరించిన సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో గురుమూర్తిని అరెస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్, అడిషనల్ డీసీపీ బీ కోటేశ్వరరావు, వనస్థలిపురం ఏసీపీ పీ కాశీరెడ్డి, మీర్పేట్ సీఐ కే నాగరాజు పాల్గొన్నారు.