హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ‘పోలీస్ డ్యూటీ మీట్-2024’ను స్టేట్ పోలీస్ అకాడమీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న తొలి పోలీస్ డ్యూటీ మీట్ కావడంతో పోలీస్ అధికారులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమానికి సీఐడీ డీజీ శిఖాగోయల్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా 26 పోలీస్ విభాగాల నుంచి 13 బృందాలుగా ఏర్పడి పలు ఈవెంట్లు నిర్వహించినట్టు సీఐడీ డీజీ శిఖాగోయల్ తెలిపారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలతోపాటు జిల్లాల నుంచి మొత్తం 400 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు చెప్పారు.
సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, యాంటీ సబొటేజీ చెక్స్, డాగ్ స్క్వాడ్, కంప్యూటర్ అవేర్నెస్, ఫొటో, వీడియోగ్రఫీలో పోటీలు నిర్వహించినట్టు వెల్లడించారు. విజేతలు వచ్చే జనవరిలో రాంచీలో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్ మీట్లో పాల్గొనున్నట్టు తెలిపారు.