నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 4: పెండింగ్ బిల్లుల విడుదల కోసం మాజీ సర్పంచ్‌లు మంగళవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లాల్లో ఎక్కడికక్కడ ని ర్బంధంలోకి తీసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మాజీ సర్పంచులు చలో అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మోర్తాడ్, ధర్పల్లి, సిరికొండ, ఆర్మూర్, బోధన్ తదితర మండలాల్లో తాజా మజీ సర్పంచులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
నల్లగొండ, మిర్యాలగూడ, కనగల్, త్రిపురారం, కొండమల్లేపల్లి, నిడమనూ రు, కట్టంగూరు, వేములపల్లి, మునుగో డు, చండూరు, నకిరేకల్, గుర్రంపోడు, చిట్యాల, గరిడేపల్లి, తుంగతుర్తితోపాటు మరికొన్ని మండలాల్లో మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేసి సాయంత్రం వరకు స్టేషన్లలో నిర్బంధించారు. ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
కులగణనపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను అడ్డుకుంటారనే అనుమానంతో ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.