ఆరునెలల క్రితందాకా శాంతి భద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పినట్టు కనిపిస్తున్నది. పేట్రేగిపోతున్న సైబర్ ముఠాలు, ఏకంగా ఐపీఎస్‌ల కుటుంబసభ్యుల నుంచే దోపిడీలు.. చెలరేగుతున్న హంతకులు, ఒక్క జూన్ నెలలోనే 26 హత్యలు, మత ఘర్షణలు, డ్రగ్స్ ముఠాలు, దారిదోపిడీ, చైన్స్నాచింగులు ఇలా ఎన్నో నేరాలూ-ఘోరాలు. హోంశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం, ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు విఫలం కావడం, వ్యవస్థాగత సమీక్షలను పక్కనబెట్టడం, శాంతిభద్రతల పరిరక్షణపై క్రమంతప్పకుండా చేయాల్సిన పనులు చేయకపోవడం ఇందుకు కారణాలని సీనియర్ ఐపీఎస్‌లు విశ్లేషిస్తున్నారు.
పోలీసు విభాగంపై సర్కారుకు పట్టుతప్పినట్టు కనిపిస్తున్నదని పోలీస్ స్టేషన్లలోనే సెటిల్మెంట్లు, భూదందాలు జరుగుతన్నాయని, ఈ ఏడాది ఏసీబీ అధికారులు నమోదుచేసిన కేసుల్లో 20కి పైగా పోలీసులవే ఉండగా దాదాపు 35 మంది వరకు పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని వారు గుర్తుచేస్తున్నారు. 30మందికి పైగా సీఐలు, ఎస్ఐలు సస్పెండ్ అవడం పరిస్థితి తీవ్రతకు సూచిక అని విశ్లేషిస్తున్నారు.
ఏకంగా ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్న ప్రదేశానికి సైతం ఇతర పార్టీల నేతలు దూసుకురావడం, హైదరాబాద్ శివార్లలో నాలుగువేల మంది వరకు హఠాత్తుగా గుమిగూటినా ప్రభుత్వాని ముందస్తు సమాచారం లేకపోవడం ఇంటెలిజెన్స్ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. ఏడెనిదినెలల క్రితం కేవలం 5 నిమిషాలుగా ఉన్న డయల్ 100 రెస్పాన్స్టైం ఇప్పుడు గంటల్లోకి జారిపోయిందని పోలీసు వ్యవస్థ వైఫల్యానికి ఇంతకు మించిన మచ్చుతునక అవసరంలేదని వారు వివరిస్తున్నారు.
దేశంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా భావిస్తున్న తెలంగాణ పోలీలు సాంకేతిక వ్యవస్థపై కేవలం 20 ఏండ్లు కూడా లేని ఒక పిలగాడు సైబర్‌దాడి చేసి కకావికలు చేయడం పర్యవేక్షణలోపాన్ని పట్టిచూపిస్తున్నదని సీనియర్ ఐపీఎస్‌లు పేర్కొంటున్నారు. అనురాగ్ శర్మ, మహేందర్‌రెడ్డి వంటి సీనియర్ ఐపీఎస్ నెలకొల్పిన వ్యవస్థలను వాడుకోవడం, కాపాడుకోవడం కూడా ఇప్పుడున్న పోలీస్ పెద్దలకు చేతకావడం లేదని వారు తప్పుబడుతున్నారు.
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): పదేండ్ల పాటు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన పోలీసుశాఖ, కేవలం ఆరు నెలల్లోనే అపఖ్యాతిని మూటగట్టుకున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ పోలీసులంటే పౌరుల్లో భయం, భక్తి కనిపించేదని, ఇప్పుడది లేక పట్టపగలే హత్యలు, దోపిడీలు, లైంగిదాడులు పెరిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదేండ్ల పోలీస్ వైభవాన్ని కండ్లారా చూసిన సీనియర్ ఐపీఎస్‌లు సైతం నేటి అధ్వానస్థితిని చూసి మధనపడుతున్నారు. నేటికీ రాష్ర్టానికి హోంమంత్రి లేకపోవడం, సీరియస్‌గా రివ్యూలేమీ జరగకపోవడంతో కిందిస్థాయి సిబ్బందిలో పోలీస్‌బాస్ అంటే భయం లేకుండా పోయిందని, జవాబుదారీతనం లో పించిందనే విమర్శలు వస్తున్నాయి. పైనుంచి అజమాయిషీ లేకపోవడం, నెలవారీ నేర సమీక్షలు జరగకపోవడం, ఫంక్షనల్ వర్టికల్స్ విధానానికి స్వస్తి చెప్పడంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో కొత్తగా రాజకీయ హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచే పొలిటికల్ మర్డర్స్ మొదలయ్యాయి. ఇన్నాళ్లూ పచ్చగా ఉన్న పాలమూరు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్‌గా మారింది. వనపర్తి జిల్లా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేశ్‌యాదవ్‌ను భూ తగాదా ముసుగులో హత్య చేసిన ఘటనను మరువక ముందే, మే 23న అదే జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సింగార్ బోగుడ తండాలో రోడ్డు నిర్మాణం విషయమై ఘర్షణ పడిన ఓ పార్టీ కార్యకర్తలు శ్రీనునాయక్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో జూన్ 2న భూతగాదాల మాటున ఓ బీఆర్ఎస్ కార్యకర్తను హత్యచేశారు. పెద్దపల్లి జిల్లాలో నాలుగు నెలల వ్యవధిలోనే సల్వాజీ మాధవరావుపై నాలుగుసార్లు హత్యాయత్నానికి పాల్పడిన ఉదంతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తనపై కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని, తనను రక్షించాలని నెత్తుటి మరకలతో పోలీస్‌స్టేషన్ మెట్లెకిన సల్వాజీ మాధవరావుపైనే పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి జైల్లోపెట్టారు. ఇక రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఇద్దరు బీజేపీ కార్యకర్తల హత్య సంచలనం రేపింది.
గడిచిన ఆరు నెలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై రాజకీయ ప్రేరేపిత దాడులు సైతం పెరిగాయి. నిజాలను వెలికితీసినందుకు ఓ తప్పుడు కేసులో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను జైలుకు పంపారు. సీఎం వ్యాఖ్యలకు చెప్పుతో కౌంటర్ ఇచ్చారనే నెపంతో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌పై కేసులు పెట్టారు. రేవంత్‌రెడ్డి పాలనను ప్రశ్నిస్తున్నందుకు జర్నలిస్టు శంకర్‌పై కొందరు దాడికి తెగబడ్డారు.
పాలనలో లోపాలు ఎత్తిచూపినందుకు చిలుక ప్రవీణ్ అనే జర్నలిస్టుపై దాడిచేశారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్‌కు చెందిన మెండె సురేశ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం చల్లా హరి, దనియాకుల హన్మంతరావు, నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం జొన్నలబోగుడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులు, రాత్లావత్ మంగమ్మ, హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యారావు, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోనికాలనీలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ వెంకటమ్మ భర్త పెద్ద వెంకన్న, కొల్లాపూర్ మండలం సింగవట్నంలో బీఆర్ఎస్ కార్యకర్తలు శివ, బాలపీరు, రాముడు, పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్కు చెందిన గుజ్జుల పరమేశ్, దేదినేనిపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు మల్లేశ్, శ్రీపతిరావు, గాంధారికి చెందిన హైమద్, రజాక్, జావేద్ వంటివారు రాజకీయ ప్రేరేపిత దాడులు, కేసుల్లో బాధితులుగా ఉన్నారు.
పట్టుమని 20 ఏండ్లు కూడాలేని ఓ యువకుడు, దేశంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా భావించే తెలంగాణ పోలీస్ సాంకేతిక వ్యవస్థపై సైబర్‌దాడికి దిగడం ఆందోళన కలిగించింది. అత్యంత విలువైన డాటా తన వద్ద ఉందని అతడే ఆన్లైన్లో పెట్టడంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అదిరిపడ్డారు. వారం వ్యవధిలోనే మూడు కీలక వ్యవస్థలపై సైబర్‌దాడి జరగడంతో దేశమంతా విస్తుపోయింది. పోలీసు వ్యవస్థలో కీలకమైన హాక్ ఐ, టీఎస్‌కాప్, ఎస్ఎంఎస్ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడి కొంత సమాచారాన్ని జతిన్‌కుమార్, తోటి హ్యాకర్స్‌తో కలిసి దొంగిలించాడు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి, డాటా లీక్ ఆధారాలతో ఢిల్లీకి వెళ్లి జతిన్‌కుమార్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నది. చోరీ అయిన డాటాను ఆన్లైన్లో 150 డాలర్లకు జతిన్‌కుమార్ అమ్మకానికి పెట్టడం నిఘా వ్యవస్థ దుస్థితికి అద్దంపడుతున్నది.
నిన్నమొన్నటిదాకా శాంతిభద్రతలకు నిలయంగా ఉన్న హైదరాబాద్‌లో థార్, చుడీదార్, చైన్‌స్నాచింగ్ గ్యాంగ్‌లు, భావరియా ముఠాలు, రైళ్లలో చోరీ చేసే గ్యాంగులు, కిరాయి హత్యల మూకలు, చిన్నారులను అపహరించే గ్యాంగులు తిష్టవేయడం ఆందోళన కలిగిస్తున్నది. పట్టపగలే దుకాణాలను కొల్లగొట్టడం, ఇండ్లలో చోరీలకు తెగబడడం, అర్ధరాత్రి శివారు ఇండ్లను లూటీ చేయడం, అడ్డొస్తే చంపేందుకూ వెనుకాడకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. చైన్‌స్నాచింగ్ గ్యాంగ్‌లు, గొలుసులు లాక్కునే క్రమంలో మహిళలను ఈడ్చుకెళ్తున్న ఘటనలు కలవరపెడుతున్నాయి.
ఇక పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చిన మొబైల్స్ చోరీ గ్యాంగులు హల్చల్ చేస్తున్నాయి. ఇక్కడ భారీగా ఫోన్లు దొంగిలించి సూడాన్‌కు పంపుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇన్నేండ్లు ఎక్కడో తలదాచుకున్న మూకలన్నీ ఒక్కసారిగా తెలంగాణను చుట్టుముట్టడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. ముఠాల్లో కొంత భయం పుట్టించేందుకు చోరీలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాల్లో కాల్పులు జరుపుతున్నారు. మరోవైపు అర్ధరాత్రి బైక్, కార్ రేసింగ్ బ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లు, డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. రౌడీషీటర్లు, డ్రగ్స్ ముఠాలు, చోరీ గ్యాంగులపై నిఘా కొరవడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

కొందరు కిందిస్థాయి సిబ్బంది ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. స్టేషన్లకు న్యాయం కోసం వచ్చే మహిళలను నయానోభయానో లొంగదీసుకోవడం, లొంగకపోతే లైంగికదాడి చేయడం వంటి ఘటనలు పోలీసుశాఖ పరువును మంటగలుపుతున్నాయి. కొందరు పోలీసులే ఏకంగా స్టేషన్లలో లంచాలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం ఇటీవల హాట్‌టాపిక్‌లా మారింది. ఇటీవల ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుల్లో పోలీసులవే 20కి పైగా ఉండగా, 35 మంది వరకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
నారాయణపేట జిల్లా ఉట్నూరులో ఇటీవల జరిగిన ఓ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గొడవ మొదలైనప్పుడే బాధితులు డయల్ 100కు కాల్ చేసినా ఎస్సై, సీఐ పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ఎస్సై, సీఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ ఉదంతం మరువకముందే కాళేశ్వరం ఎస్సై ఏకంగా ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్‌ను రివాల్వర్‌తో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. అప్పటికే వివిధ సివిల్, సెటిల్మెంట్లలో తలదూర్చిన సదరు ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల్లోనే పలు వివాదాల్లో తలమునకలై వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చిన ఎస్సై, సీఐలను రెండు మల్టీజోన్ల నుంచి ఇప్పటివరకు 30 మందికిపైగా సస్పెండ్ చేయడంతో పాటు ఐజీ ఆఫీస్‌లకు అటాచ్ చేశారు. ఒక్క మల్టీజోన్-1లోనే అత్యధికంగా 22 వరకు కేసులున్నాయి.
లాఅండ్ఆర్డర్ను గాడిలో పెట్టాల్సిన కొందరు యువ పోలీస్ అధికారులు దారితప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీకెండ్స్‌లో మందుపార్టీలు చేసుకోవడమే కాకుండా అందులో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. సిగ్నల్ యాప్, వాట్సాప్ గ్రూప్‌లు, కోడ్ లాంగ్వేజ్‌తో పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారని సమాచారం. మరికొందరు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లలో నిమగ్నమైనట్టు ఆరోపణలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో డీజీపీలుగా ఉన్న అనురాగ్‌శర్మ, మహేందర్‌రెడ్డి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు పోలీస్ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ప్రతినెలా క్రైమ్ మీటింగ్‌లు పెట్టి నేరుగా ఎస్పీలతో మాట్లాడేవారు. ఏ జిల్లాలోనైనా నేరాల సంఖ్య పెరిగినట్టు తేలితే డీజీపీ ఆఫీస్‌కు పిలిపించి క్లాస్ తీసుకునేవారు. ఆయా జిల్లాల్లో నేరాల అదుపుకోసం సలహాలిచ్చేవారు. అదే విధానాన్ని మాజీ డీజీపీ అంజనీకుమార్ కొనసాగించారు. నెల, మూడునెలలు, ఆరునెలలు, తొమ్మిది నెలలకోసారి క్రైమ్ రివ్యూ మీటింగ్‌లు పెట్టి, సీపీలు, ఎస్పీలను అప్రమత్తం చేసేవారు. 2018లో డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ విధానంతో జవాబుదారీ తనం ఉండేది. సిబ్బంది పనులను విశ్లేషించి, వాటిని గణాంకాల్లోకి మార్చి, గ్రేడింగ్ ఇచ్చి, ప్రతిభావంతులకు రివార్డులు సైతం ఇచ్చేది. పోలీస్ ఉన్నతాధికారులు మొదట్లో క్రైమ్ మీటింగ్, ఫంక్షనల్ వర్టికల్స్‌ను కొనసాగించినా నేడు వాటిపై ఎలాంటి సమీక్ష లేదు. దీంతో సిబ్బందిలో జవాబుదారీతనం కొరవడిందని సీనియర్లు అంటున్నారు.
దారుణాలకుతోడు రాష్ట్రంలో సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యధికంగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. రోజుకో కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజూ తెలంగాణ నుంచి సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్న సొమ్ము అక్షరాలా రూ.5కోట్లు. ఇందుకు సైబర్ నేరాలపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తున్నది. కేసీఆర్ హయాంలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటుతో కొంత వరకు నేరాలు అదుపులోకి వచ్చినా ఇప్పుడు విచ్చలవిడిగా పెరిగాయి. సైబర్‌క్రైమ్ బాధితుల్లో ఐపీఎస్‌ల కుటుంబీకులే ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థంచేసుకోవచ్చు. వీటికితోడు వైట్‌కాలర్ మోసాలు, రియల్ ఎస్టేట్, చిట్టీల మోసాలు, కొత్త కంపెనీలు పెట్టి డబ్బులు వసూలు చేసి బిచానా ఎత్తేసే ఘటనలు నానాటికీ పెరుగుతున్నాయి. వైట్ కాలర్ నేరాలకు అడ్డాగా మారిందన్న అపవాదును హైదరాబాద్ మూటగట్టుకున్నది.
బీఆర్ఎస్ హయాంలో ‘అసలైన పోలీసులంటే ఏంటో చూపిస్తాం’ అని చెప్పిన ఓ సీనియర్ ఐపీఎస్, ప్రస్తుతం నమోదవుతున్న నేరాల తీవ్రతను చూసి తలెత్తుకోలేకపోతున్నారు. ఒక్క జూన్‌లోనే రాష్ట్రవ్యాప్తంగా 26కు పైగా హత్యలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థమవుతున్నది. ఈ నెల 14న హైదరాబాద్ నగరంలో ఒక్కరోజే 5 హత్యలు జరగడం కలకలం సృష్టించింది. ఇటు ముక్కుపచ్చలారని చిన్నారులపై లైంగికదాడులు, హత్యలు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు లెక్కలేకుండాపోయింది. ఇటీవల మహబూబ్‌నగర్‌లో చెంచు మహిళ ఉదంతం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. చెంచుల భూమి కొట్టేసేందుకు కౌలు చేస్తున్నవారే తిరగబడి దాడి చేయడం, బాధితురాలి మామను హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఆరునెలల నేర లెక్కలపై ‘నమస్తే తెలంగాణ’ ఆరాతీయగా సీఐడీ విభాగం రికార్డులను సరిగా నిర్వహించడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.
జగద్గిరిగుట్ట, జూన్ 25: నడుచుకుం టూ వెళ్తున్న మహిళ మెడలోంచి దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం డివిజన్ ఉ షోదయకాలనీకి చెందిన శివజ్యోతి, కాలనీలోని ఆలయానికి వెళ్తున్నది. ఇం తలో బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోంచి మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లినట్టు ఆమె ఫిర్యాదు చే సింది. సమీపంలోని హెచ్ఏఎల్ కాలనీలోనూ ఇదే దుండగుడు చోరీకి ప్రయత్నించగా అక్కడి మహిళ తప్పించుకోవడంతో దొంగ పరారైనట్టు స్థానికులు తెలిపారు. ఉషోదయకాలనీకి వచ్చి గొలుసు లాక్కెళ్లినట్టు తెలుస్తున్నది.
మణికొండ, జూన్ 25 : నార్సింగిలో ని పీరం చెరువులో జాలర్లను రౌడీ షీట ర్లు కత్తితో బెదిరించి వారినుంచి రూ.11 వేలు లాక్కున్నారు. ఓ జాలరిపై దాడికి తెగబడ్డారు. ‘మేరా నామ్ షూటర్ ఇర్ఫాన్.. అబ్తక్ చౌతీస్ (34) మర్డర్స్ కరా.. తేరేకు బీ జాన్ సే మార్ డా లూంగా’ అంటూ బెదిరింపులకు దిగిన ట్టు బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రీలాంచ్ రియల్ ఎస్టేట్ మోసానికి గురైన ఓ బాధితురాలు రూ.10 కోట్ల దాకా మోసపోయానని పోలీసులు న్యాయం చేయాలని డీజీపీ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నది. డబ్బు తిరిగిప్పిస్తానని ఓ యువ ఐపీఎస్ అధికారి తన వద్ద డబ్బు తీసుకొని నేటికీ న్యాయం చేయలేదని బాధితురాలు వాపోతున్నది. తనకు న్యాయం జరగకపోతే డీజీపీ ఆఫీసుముందే నిప్పంటించుకుంటానని పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెతో డీజీపీని కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పుడా ఐపీఎస్ ఓ కమిషనరేట్‌కు సీపీగా వెళ్లాడని, అతడికి డబ్బులిచ్చినప్పుడు సీసీ కెమెరాల్లో సైతం రికార్డయిందని, తక్షణం తనకు న్యాయం చేయాలని పట్టుబట్టింది. సోమవారం డీజీపీ ఆఫీసులో లా అండ్ ఆర్డర్ డీజీని కలిపించేందుకు ప్రయత్నించినా ఆమె నేరుగా డీజీపీనే కలుస్తానని మొండికేసింది. ఓ మహిళా బాధితురాలితో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది. తనకు పోలీసులు న్యాయం చేయకపోతే చావే శరణ్యమంటూ డీజీపీ ఆఫీసులోనే తిరుగుతుండగా ఐదుగురు కానిస్టేబుళ్లను ఆమెకు కాపాలాగా ఉంచారు.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ఎలా మత ఘర్షణలకు నెలవుగా ఉందో, ప్రస్తుత పరిస్థితి అలానే తయారైందన్న వాదనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో ఒక్క మత ఘర్షణ కూడా జరగకున్నా నాడు భైంసాలో జరిగిన చిన్న గొడవను కొన్ని మీడియా సంస్థలు పెద్దవి చేసి చూపాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం ఎన్నికల కమిషన్ పాలనలోకి వెళ్లగా భైంసాలో మళ్లీ మత కల్లోలాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పాతబస్తీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అనంతరం బోడుప్పల్లో ఇదే తరహా ఘర్షణలు కలవరపెట్టాయి. అటు పాతబస్తీ, ఇటు భైంసా కాకుండా కొత్తగా మెదక్‌లో చోటుచేసుకున్న మత ఘర్షణలు పెను దుమారం రేపాయి. దేశవ్యాప్తంగా వీటిపై విస్తృత చర్చజరిగింది. మెదక్ మత ఘర్షణల్లో నిర్లక్ష్యం వహించిన మెదక్ టౌన్, రూరల్ స్టేషన్ల సీఐలను ఐజీ రంగనాథ్ డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు.