రాంనగర్, మే 26: మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మైనారిటీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ ఏక్తాయాత్ర పేరుతో కరీంనగర్ ఎంపీ బండి.. మదర్సాలు లేకుండా చేస్తామని, మసీదులు కూలగొట్టి శివలింగాలు తీస్తామంటూ ఉద్రేక పూరిత ప్రసంగాలు చేసి ప్రజల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేరొన్నారు. శివలింగాలు వస్తే తీసుకుంటామని శవాలు వస్తే వదిలి పెడతామంటూ ముస్లిం మైనారిటీ వర్గాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం లిఖితపూర్వక ఫిర్యాదును టూటౌన్ సీఐ లక్ష్మిబాబుకు అందజేశారు. టీఆర్ఎస్ మైనారిటీ నాయకులు సాజిద్‌ఖాన్, మహమ్మద్ సాదిక్, ఇసాక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.