Traffic Challan | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు బెదిరించరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రాఫిక్ ఉల్లంఘనదారుల వాహనాల తాళాలు తీసుకోవడం, చలానా చెల్లించాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని స్పష్టంచేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం నోటీసులు జారీచేయాలని, విధించిన చలాన్ల మొత్తాన్ని చెల్లించని వారిని ప్రాసిక్యూట్ చేయాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. చలాన్లను ఆన్లైన్ ద్వారా చెల్లించేవారికి ఆ అవకాశం ఇవ్వాలని పేరొంది. చలానా సొమ్ము చెల్లించని వారిపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టాలంది. విధుల్లో భాగంగా వాహనదారులను తనిఖీ చేయడానికి ఈ ఆదేశాలు అడ్డంకి కావని వివరించింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి జరిమానా విధించి, చలాన్లు వసూలు చేసే అధికారాన్ని రవాణా, పోలీసుశాఖ అధికారులకు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 108 అమలును నిలిపివేసేందుకు కోర్టు నిరాకరించింది.
ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తున్నందుకు వాహన యజమానికి రూ.1200 జరిమానా విధింపునకు పోలీసులు, రవాణాశాఖకు అధికారం కల్పిస్తూ 2011లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 108ని సవాలు చేస్తూ వీ రాఘవేంద్రాచారి వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు వాహనాలను ఆపి బెదిరించి చలాన్లు వసూలు చేస్తున్నారని చెప్పారు. మోటరు వాహన చట్టం-1988లోని సెక్షన్ 200 కింద పోలీసులు, రవాణాశాఖ అధికారులు జరిమానా వసూలు చేసే అధికారం కల్పించే జీవోకు అనుగుణంగా నోటిఫికేషన్ వెలువడలేదని గుర్తుచేశారు. కాబట్టి ఆ జీవో అమలు చెల్లదని తెలిపారు. జీవో ప్రకారం పోలీసులకు చలాన్ల వసూలు చేసే అధికారం లేదని అన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. జీవోకు అనుగుణంగా నోటిఫై చేయలేదని ఒప్పుకున్నారు. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలపై స్పందించిన హైకోర్టు.. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న చలాన్లను బలవంతంగా వసూలు చేయరాదని ఆదేశించింది. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించిన వారి వాహనాల తాళాలు తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పింది. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలని పేరొన్నది. విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.