Telangana | మేడ్చల్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): కోర్టు వివాదంలో ఉన్న దాదాపు 20 ఎకరాల తమ భూమిని కబ్జాదారులతో కలిసి పోలీసులు బలవంతంగా లాగేసుకున్నారంటూ ఓ బాధితుడు ఆరోపించారు. కబ్జాదారులు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబును కలిసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి తామేమీ చేయలేమని, సమస్య పరిష్కారం కోసం ‘బిగ్ బ్రదర్స్’ను, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును కలవాలని సూచించారని పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో సంచలనమైంది. బాధితుడు రాకేశ్‌రెడ్డి కథనం ప్రకారం.. మల్కాజిగిరి జిల్లా మౌలాలి తిరుమలగిరిలోని సర్వే నంబర్ 398, 399, 409, 410, 411/1, 411/2 లలో ఉన్న 19 ఎకరాల 18 గుంటల భూమిని 1968లో తాజ్ ఉన్నిసాబేగం నుంచి రాకేశ్‌రెడ్డి తండ్రి సూర్యనారాయణరెడ్డి కొనుగోలు చేశారు. 1974లో తాజ్ ఉన్నిసాబేగం చనిపోవడంతో భవిష్యత్తులో ఆమె కుటుంబ సభ్యుల నుంచి వివాదాలు ఉండొద్దన్న ఉద్దేశంతో 1977లో ఆమె కుటుంబ సభ్యులతోనూ సూర్యనారాయణరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 1980లో అప్పటి ప్రభుత్వం ఆ స్థలంలో క్వారీకి అనుమతివ్వడంతో 1997 వరకు క్వారీ నిర్వహించారు. ఆ తర్వాత ఆ స్థలంలో గ్రామ పంచాయతీ అనుమతితో గోడౌన్, డైరీ ఫామ్ నిర్వహించారు. ఈ స్థలానికి గ్రామ పంచాయతీ 43,155,156, 156/1 ఇంటి నంబర్లు కేటాయించి పన్నులు కూడా వసూలు చేసింది.
2010లో రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఈ భూములపై అభ్యంతరం వ్యక్తం చే యడంతో హైకోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకున్నట్టు రాకేశ్‌రెడ్డి తెలిపారు. ఆ భూము ల విషయం లో జోక్యం చేసుకోవద్దని కోర్టు తన తీర్పులో పేర్కొంది. అప్పటి నుంచి ఆ భూమి లో రాకేశ్‌రెడ్డి కుటుంబం వ్యాపారాలు నిర్వహించుకుంటున్నది.
తాము తాజ్ ఉన్నీసాబేగం పూర్వీకులమంటూ హాజీబేగం, మరో ముగ్గురు ఈ నెల 5న ఈ భూమిని కబ్జా చేసేందుకు వందలాదిమందితో వచ్చినట్టు రాకేశ్‌రెడ్డి తెలిపారు. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే చర్యలు తీసుకోకపోవడమే కాకుండా తిరిగి కబ్జాదారులకే సహకరించారని ఆరోపించారు. దీంతో తాము రాచకొండ సీపీ సుధీర్‌బాబును ఆశ్రయిస్తే ఆయన కూడా తమకు న్యాయం చేయలేదని వాపోయారు. తాము ఫిర్యాదుల్లో ఉండగానే, మరోవైపు తమ భూమిలోని గోడౌన్లు, షెడ్లను ధ్వంసం చేయడంలో కబ్జాదారులకు పోలీసులు సహకరించారని ఆరోపించారు. గోడౌన్లలో ఉన్న కోట్ల రూపాయల విలువైన మెడికల్ పరికరాలతో పాటు రూ. 3 కోట్ల విలువైన ఆస్తి ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోపోవడంతో ఈ నెల 14న కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకున్నాం. ఆ ఉత్తర్వులను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. మమల్ని ఆ స్థ లంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులు ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. సీపీ సుధీర్‌బాబు మాత్రం బిగ్ బ్రదర్స్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును కలవాలని చెప్తున్నారు.