ఎల్బీనగర్, జూలై 31: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 46ను రద్దు చేయాల ని నిరసిస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం రాత్రి భారీసంఖ్యలో జాతీయ రహదారిపైకి వచ్చి, దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
ప్లకార్డులను చేతబూని, ప్రభుత్వానికి వ్యతిరేకం గా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకుంటున్నా ఏ నాయకుడూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన వైఖరిని మార్చుకుని జీవో 46ను రద్దు చేయాలని, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను ఆలకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళన వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు వచ్చి నిరుద్యోగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): జీవో 46ను రద్దు చేయాలని కోరుతూ నిరుద్యోగులు రోడ్డెక్కితే పోలీసులు వాళ్ల అంగీలను చింపుతరా? అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ జీవో బాధితులు బుధవారం రాత్రి దిల్సుఖ్నగర్ లో చేపట్టిన ఆందోళనపై రాకేశ్‌రెడ్డి స్పం దించారు.నిరుద్యోగులకు కల్లబొల్లి హామీలిచ్చినందుకు కాంగ్రెస్నేతల ప్యాంట్లు ఊడపీకాలా? వద్దా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి, ఆయన మంత్రివర్గ సహచరులకు సిగ్గు, శరం ఉంటే మాట మీద నిలబడి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 46 జీవో బాధితుల ఉసురు రేవంత్ సర్కారుకు తగులుతుందని మండిపడ్డారు.