Konatham Dileep | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో నమోదైన ఓ కేసు విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అమెరికాలోని వర్జీనియాలో తన తండ్రి జ్ఞాపకాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై స్వదేశానికి తిరిగివచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకొని అర్ధరాత్రి నిర్మల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏడాదిలోనే దిలీప్ మీద సుమారు 15 కేసులు పెట్టిన రేవంత్ ప్రభుత్వం ఆయనను పలుమార్లు అరెస్ట్ చేసింది.
సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సర్కారును నిలదీస్తున్నందుకే ఆయనను కేసులతో వేధిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. నిరుడు ఆయనపై ‘లుక్ ఔట్ సర్క్యులర్’ కూడా జారీ చేసింది. ఈ సర్క్యులర్‌పై హైకోర్టులో పిటిషన్ వేసి నెలరోజులు అమెరికా వెళ్లి వచ్చేందుకు దిలీప్ అనుమతి పొందారు. తన తండ్రి కొణతం బక్కా రెడ్డి జ్ఞాపకార్థం కుటుంబసభ్యులు ప్రచురించిన పుస్తకాన్ని అమెరికాలోని వర్జీనియాలో మే 18న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు అనుమతితో అమెరికా వెళ్లి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్య ద్వారా పోలీసులు నేరుగా హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని కొణతం దిలీప్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుతున్నందుకే కొణతం దిలీప్‌ను కాంగ్రెస్ సర్కారు అరెస్ట్ చేసిందని, ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం ఇ లాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడటం దుర్మార్గమని మంగళవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం న్యాయస్థానాలను అవమానించడమేనని పేర్కొన్నారు. కొణతం దిలీప్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.