ఇనుగుర్తి, మార్చి 19 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తిట్టాడన్న కారణంతో 77 ఏండ్ల దళిత వృద్ధుడిని సీసీఎస్ పోలీసులు లాక్కెళ్లిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో బుధవారం కలకలం రేపింది. చిన్నముప్పారానికి చెందిన దర్శనం వెంకటయ్యకు గతంలో మూడెకరాల అసైన్డ్ భూమి ఉండేది. అందులోనే వ్యవసాయం చేసుకుంటూ వృద్ధ దంపతులు జీవనం సాగించేవారు. ఈ భూమిని ప్రభుత్వం లాక్కున్నది. దీంతో వారికి బతుకుదెరువు లేకుండా పోయింది.
ఈ క్రమంలో ప్రభుత్వానికి తన సమస్యను విన్నవించుకునేందుకు ఇటీవల హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ యూట్యూబ్ చానల్లో మాట్లాడుతూ రేవంత్ సర్కారు తీరుపై మండిపడ్డాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పోస్ట్ చేశారన్న కారణంతో ఇటీవల మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వీ యా దవ్ను పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవలే వారు విడుదలయ్యారు. అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో వృద్ధుడిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ పనులు ముగించుకొని వచ్చి వృద్ధ దంపతులు అన్నం తింటుండగా మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంకటయ్యను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అతడిని హైదరాబాద్‌కు తరలించినట్టు తెలిసింది.
‘మేము తోట ఏరబోయి వచ్చినం. వచ్చినంక నా భర్తకు అన్నం పెడుతున్న. అయినె తింటుండంగ ముగ్గురొచ్చిండ్రు. ఒకాయన పోలీసు డ్రెస్ మీదున్నడు. ఇద్దరేమో తెల్లబెట్టలేసుకున్నరు. వచ్చుడు వచ్చుడే రావయ్య రా.. నువ్వట రేవంత్‌రెడ్డిని ఏమో అన్నవట అనుకుంట తినేటోని పళ్లెమాడ గుంజిపెట్టి అటో రెక్క ఇటొకరెక్క పట్టుకొని తీస్కొనిపోయిండ్రు. ఏందీ ఎక్కడికి తీస్కపోతాన్రు. ఏం సంగతి? నా ముసలోడు బువ్వదినకుండ తీస్కపోతార్రెందుకు? అనడిగినా నాకేం చెప్పలేదు. నా భర్తను తీస్కోని కార్ల ఏసుకొని ఎళ్లిపోయిండ్రు. నేను ఏడ్సుకుంట ఇంట్లకచ్చిన. నా భర్తకు బీపీ ఉన్నది. షుగర్ ఉన్నది. తల్కాయె మంచిగలేదు. ఆయినెకు ఏదన్న జరిగితే సర్కారుదే బాధ్యత. రేవంత్‌రెడ్డే పెట్టుకోవాలె. నా భర్తను నా ఇంటికి తీస్కరాండ్రి’
– దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి