భూపాలపల్లి రూరల్, ఆగస్టు 3: ప్రియుడి మోజులో పడి భర్తతోపాటు కూతురును హత్య చేసిన తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ఖరే మీడియాకు వెల్లడించారు. గత నెల 28న కమలాపూర్ క్రాస్‌రోడ్డు సమీపంలో గుర్తుతెలియని యువతి మృతదేహం వద్ద క్షుద్రపూజలు చేసినట్టుగా అనవాళ్లు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జున, ఎస్పై ఆకుల శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన యువతిని చిట్యాల మండలం ఒడితలకు చెందిన కప్పల వర్షిణి (22)గా గుర్తించారు. చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో గత నెల 6న తన కూతురు కనబడటం లేదని తల్లి కప్పల కవిత ఫిర్యాదు చేసింది. తమ కూతురిని గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజల కోసం చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో కాటారం పోలీసులు హత్య కేసు నమోదు చేసి కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఈనెల 2వ తేదీన కాటారం సీఐ తన సిబ్బందితో గంగారం క్రాస్‌రోడ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, టీవీఎస్ ఎక్సెల్ మోటర్ సైకిల్‌పై కప్పల కవిత, మరొక వ్యక్తితో కొయ్యూరు నుంచి కాటారం వైపు వస్తూ కనిపించారు. అయితే పోలీసులను చూసి వాహనాన్ని అకడే వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకుని విచారించారు. నేరాన్ని వారు అంగీకరించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒడితల గ్రామానికి చెందిన కప్పల కుమారస్వామి (50) మొదటి భార్య చనిపోగా, 24 ఏండ్ల క్రితం కొయ్యూరు మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన కవితను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు వర్షిణి, హన్సిక జన్మించారు. హన్సికకు వివాహం కాగా, వర్షిణితోపాటు కుమారస్వామి, కవిత దంపతులు వ్యవసాయం చేస్తున్నారు.
ఐదేండ్ల క్రితం కుమారస్వామికి పక్షవాతం వచ్చింది. ఇదే గ్రామానికి చెందిన జంజర్ల రాజ్‌కుమార్‌తో కవితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త కుమారస్వామికి తెలియడంతో మందలించాడు. దీంతో భర్త అడ్డుపడుతున్నాడని భావించిన కవిత ప్రియుడు రాజ్‌కుమార్‌తో కలిసి జూన్ 25న భర్త కుమారస్వామి గొంతు నులిమి హత్య చేసింది. తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని బంధువులను నమ్మించి అంత్యక్రియలు జరిపించింది. తండ్రి మృతిపై పెద్ద కూతురు వర్షిణి తరచూ తల్లి కవితను నిలదీసింది. దీంతో గత నెల 2వ తేదీ అర్ధరాత్రి నిద్రలో ఉన్న వర్షణిని తన భర్తను చంపిన విధంగానే ప్రియుడు రాజ్‌కుమార్‌తో కలిసి హత్య చేసింది. పోలీసుల విచారణలో నిందితులు నేరం అంగీకరించడంతో కవితతోపాటు రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు.