న్యూస్‌నెట్‌వర్క్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా లగచర్ల బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న పలు సంఘాల నేతలను ఆయా చోట్ల పోలీసులు కట్టడి చేశారు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వికారాబాద్ జిల్లా దోమ మండల సేవాలాల్ సేన నాయకులను మండల పరిధిలోని బుద్లాపూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య పోలీసులు అరెస్టు చేసి దోమ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, హైదరాబాద్ సహాయ కార్యదర్శి విజయ్‌కుమార్, కార్యవర్గ సభ్యుడు బాలకృష్ణను పరిగి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్‌నాయక్, ఎఐబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, ఓయుజేఏసీ నాయకుడు నెహ్రూనాయక్, రైతుసేన నాయకుడు కిషన్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌లను అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కొనసాగుతున్న తనిఖీలు
లగచర్ల ఘటన తరువాత పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై అంగడి చిట్టంపల్లి స్టేజీ, మన్నెగూడ పోలీస్ స్టేషన్ ఎదుట చన్గోముల్ పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. బుధవారం తాండూరు ప్రాంతానికి చెందిన ఓ గిరిజన కుటుంబం హైదరాబాద్‌లో వివాహానికి హాజరై తిరిగి సాయంత్రం ఓ వాహనంలో వస్తున్నారు. హైవే రోడ్డుపై పోలీస్‌స్టేషన్ ఎదుట తనిఖీ చేస్తున్న పోలీసులు వారిని ఆపి స్టేషన్‌లోని తీసుకెళ్లి పూర్తి వివరాలను అడిగి నమో దు చేసుకొని పంపించారు. వికారాబాద్ జిల్లాకు చెందిన గిరిజనులు హైదరాబాద్‌లో ఆయా పార్టీల నేతలు, మానవ హక్కుల పోరాట సంఘాల సభ్యులను కలిసి లగచర్ల ఘటనా విషయాలు వివరించేందుకు వెళ్లారా..? అనే కోణంలో విచారిస్తున్నారు.