సుబేదారి, నవంబర్ 11: ధాన్యం కుంభకోణంలో 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన సాంబశివ రైస్‌మిల్లు యజమాని బెజ్జంకి శ్రీనివాస్ 2025 యాసంగిలో శాయంపేట మండలం కాంట్రపల్లి ఐకేపీ సెంటర్ నుంచి 8,049 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డాడు. విజిలెన్స్, సివిల్‌సైప్లె అధికారులు ఫిర్యాదు చేయడంతో శాయంపేట, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఐకేపీ సెంటర్ నిర్వాహకులు లలిత, చరణ్‌సింగ్, హైమావతి, అనిత సహకారంతో నకిలీ ఎంట్రీలు చేయడానికి క్వింటాకు రూ.120 చొప్పున ఇవ్వడానికి మిల్లు యజమాని శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
12 మంది కుటుంబసభ్యులు, బంధువులను నకిలీ రైతులుగా సృష్టించి 8,049 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాడు. 12 మంది ఖాతాల్లో ప్రభుత్వం నుంచి రూ.2.10 కోట్లు జమయ్యాయి. వీటిలో రూ. 1.32 కోట్లు డ్రా చేసి, కమలాపూర్‌లో రూ. 32 లక్షలతో ఎకరం భూమి కొనుగోలు చేశాడు. నిందితుడు శ్రీనివాస్, అతడి భార్య శోభారాణి, కుమారులు, కోడళ్లు , బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. 9.50 లక్షలు, కారు, రూ. 32 లక్షల విలువ చేసే ల్యాండ్ పేపర్లు స్వాధీనం చేసుకొని, బ్యాంకులో ఉన్న రూ. 54 లక్షలు ఫ్రీజ్ చేశారు. లలిత, సెంటర్ నిర్వాహ కులు అనిత, రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.