Nallamala Sagar | హైదరాబాద్, జనవరి12 (నమస్తే తెలంగాణ) : పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వాదనలన్నీ వీగిపోయాయి. సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హతే లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టుకు అడ్డంకులేవీ లేకుండాపోయాయి. ఇది రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వక నిర్ణయాల ఫలితమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభు త్వం ఆది నుంచీ పైకి ఒకటి చెబుతూ ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుతోనే పిటిషన్‌కు విలువలేకుండా పోయిందని తెలుస్తున్నది. ప్రస్తుతం సివిల్ సూట్ వేసినా ప్రయోజనం ఉండదని, ఇది సర్కార్ వైఫల్యమేనని స్పష్టమ వుతున్నది. ఏపీ సర్కార్‌కు రేవంత్ సర్కారు లోపాయికారిగా ఉన్నదనే వాదనలకూ బలం చేకూరుతున్నది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ కృష్ణా, గోదావరి బేసిన్ల్లో ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. కానీ చట్టాన్ని తుంగలో తొక్కి పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును ఏపీ తెరమీదికి తెచ్చింది. ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరడంతోపాటు, మే నెలలోనే పీఎఫ్ఆర్(ప్రాజెక్టు ఫీజబులిటీ రిపోర్టు)ను సమర్పించింది. ప్రాజెక్టు పనుల కోసం జలహారతి కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేసింది. అప్పటికీ రేవంత్ సర్కార్‌లో స్పందన లేకపోవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నిలదీతతో ఎట్టకేలకు కదిలింది.
ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని ప్రగల్భాలు పలికింది, కానీ ఆచరణలో మళ్లీ ఏపీతో చర్చలకు మొగ్గుచూపింది. పోలవరం-బనకచర్ల (నల్లమలసాగర్) ప్రాజెక్టు అంశముంటే చర్చలకు వచ్చేది లేదని చెప్పినా ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. జూలైలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో సమావేశానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు. వివాదాల పరిష్కారం కోసం కమిటీ వేయాలని నిర్ణయించడమే కాదు, అంగీకారంగా సంతకాలు చేసి మరీ వచ్చారు. ప్రాజెక్టుపై చర్చే జరుగలేదని రేవంత్ బాహాటంగా బుకాయించడం సర్కార్ తీరుకు అద్దం పట్టగా, ఇప్పటికీ ఆ ఊసెత్తకపోవడం విచారకరం.
ప్రాజెక్టుపై ఏపీ దూకుడును అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నించిన దాఖలాలే లేవు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి రామానాయుడు పత్రికాముఖం గా ప్రాజెక్టును చేపడుతున్నట్టు ప్రకటించినా పట్టించు కోలేదు. ప్రతిపక్షం నిలదీసిన తరువాత కానీ కంటితుడుపుగా ప్రాజెక్టును అడ్డుకుంటామని, అదేమంటే కేంద్రానికి, న్యాయపర వేదికలపై తొలుత ఫిర్యాదు చేసి న తర్వాత సుప్రీంకోర్టుకు పోవాల్సి ఉంటుందని సుద్దు లు చెప్పి, తర్వాత కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకొన్నది తప్ప చేసిందేమీ లేదు. మరోవైపు ఏపీ సర్కార్ మాత్రం పోలవరం-బనకచర్లకు తొలుత టెండర్లను ఆహ్వానించింది, తర్వాత అర్ధంతరంగా రద్దు చేసుకున్నది. ప్రాజెక్టులో మార్పులు చేయడంతోపాటు, బనకచర్లకు బదులు నల్లమలసాగర్‌ను తెరమీదికి తీసుకురావడం, డీపీఆర్ తయారీకి సైతం టెండర్లను పూర్తి చేయడం గమనార్హం. ఇంతా జరిగిన తర్వాత డిసెంబర్ 16న సుప్రీంలో రిట్ పిటిషన్ వేయడం ఏపీకి రేవంత్ సర్కార్ వంతపాడుతున్న తీరుకు అద్దం పడుతున్నది.
ప్రాజెక్టును ఒప్పుకొనేది లేదంటూ తెలంగాణ ప్రభు త్వం ఏపీ సర్కార్ అడుగులకు మడుగులు ఒత్తేలా వ్యవహరిస్తున్నది. నల్లమలసాగర్ ప్రాజెక్టుపై కమిటీ ఏర్పాటే అందుకు నిదర్శనం. నిజానికి నదీజలాల పంపిణీ అధికారం ట్రిబ్యునల్ ఒక్కదానికే తప్ప ఏ న్యాయస్థానం, కేంద్ర సంస్థకూ ఉండదు. ఏపీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ముందుకు సాగుతున్నది. తెలంగాణ నీటి హక్కులకూ అది తీవ్ర విఘాతమే. ఏపీ ప్రతిపాదనలను వ్యతిరేకించాల్సిన తెలంగాణ సర్కారే చర్చల ప్రస్తావన తేవ డం గమనార్హం.
జల్‌శక్తిశాఖ మంత్రి నేతృత్వంలో నిరుడు జూలై16న పోలవరం బనకచర్ల(నల్లమలసాగర్) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి అంశాలపై కమిటీ వేసేందుకూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంగీకారం తెలుప గా, బయటికేమో చర్చలే జరగలేదని బుకాయించింది. ఇదిలా ఉంటే నిపుణుల కమిటీ కోసం ఏపీ సర్కార్ గత డిసెంబర్ 15న తమ అధికారుల పేర్లను ప్రతిపాదించగా, రేవంత్ సర్కార్ సైతం రాష్ట్రం తరఫున అధికారుల పేర్లను డిసెంబర్ 23న పంపడం గమనార్హం. గోదావరి జలాల మళ్లింపునకు ఒప్పుకోమన్న సర్కార్ గుట్టుగా కేంద్రానికి అధికారుల పేర్లను ప్రతిపాదించి తెలంగాణ జలహక్కులకు తీరని విద్రోహాన్ని తలపెట్టింది.
రేవంత్ సర్కార్ డిసెంబర్ 16న సుప్రీంకోర్టులో రిట్ పి టిషన్‌ను దాఖలు చేసినా, అదీ కంటితుడుపు చర్యేననొ తెలిసిపోతున్నది. వాస్తవంగా డీపీఆర్ తయారీ అంటే ప్రాజెక్టును నిర్మించడం కాదు, నిర్మాణ ప్రణాళిక మాత్రమేనని ఇంజినీర్లు వెల్లడిస్తున్నారు. డీపీఆర్ తయారీ చేయవద్దని న్యాయస్థానాలు స్టే ఇవ్వబోవని తెలిసినా రేవంత్ సుదీర్ఘ కాలయాపన చేసి చివరకు అదే విధమైన రిట్ పిటిషన్‌ను దాఖలు చేయగా, ప్రస్తుతం విచారణార్హత లేదని సుప్రీం తేల్చిచెప్పడం గమనార్హం.
సుప్రీంకోర్టులో తెలంగాణవాదనలు బలహీనమవడానికి రేవంత్ నిర్ణయాలే కారణమని అవ గతమవుతు న్నది. సుప్రీం లేవనెత్తిన ప్రశ్నలే అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. తెలంగాణ సర్కార్ తప్పులనే ఏపీ ప్రభు త్వం ఎత్తిచూపింది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జలవివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటైందని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో వాదనలు వినిపించగా ధర్మాసనమూ వాటితో ఏకీభవించింది. కమిటీ ఏర్పాటు చేసుకుని, మరోవైపు కోర్టుకు వచ్చి స్టే కోరడం ఏమిటని తెలంగాణ సర్కార్‌నే నిలదీసిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో తెలంగాణవాదనలకు విలువే లేకుండాపోయింది. వెరసి పిటిషన్‌కు విచారణర్హతే లేదంటూ కోర్టు తేల్చిచెప్పగా, రేవంత్ నిర్ణయం మన జలహక్కులకు తీరని ముప్పును తెచ్చిపెట్టింది.
ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీకి వంతపాడేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నది. ప్రాజెక్టును ఏపీ తెరమీదకు తీసుకువచ్చింది మొదలు ఇప్పటివరకు ప్రతి అడుగులోనూ తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలనే ఎదుర్కొంటున్నది. ప్రాజెక్టును ఎలా నిలువరించాలనే అంశంపై మేధోపరమైన చర్చలు గానీ అధ్యయనం గానీ చేయలేదు. ఏపీ జలదోపిడీని అడ్డుకోవచ్చుననే అంశాలపైనా కసరత్తు జరిపిందీ లేదు. రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకోవడం, సీనియర్ ఇంజినీర్ల సలహాలు పక్కనపెట్టి కనీస అనుభవం లేని వారితో ముందుకు సాగడం ఒకవైపు అయితే, చర్చలంటూ, కమిటీలంటూ ఉత్సాహం చూపటం మరోవైపు.. ఇలా ఏపీ సర్కార్‌తో లోపాయికారి ఒప్పందంతోనే రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నదని పలువురు ఇంజినీర్లు సైతం కోడై కూస్తున్నారు.
సహేతుకమైన వాదనలు వినిపించకపోవడం, ఆచరణ, వాదనలకు పొంతన లేకపోవడంతో రిట్ పిటిషన్ వీగిపోయింది. సుప్రీంకోర్టు అక్షింతలు, ఆక్షేపణలతో పిటిషన్‌ను వెనక్కితీసుకునేందుకు తెలంగాణ సర్కారే అంగీకరించడం గమనార్హం. అయితే సివిల్ సూట్ వేస్తామంటూ మళ్లీ ప్రగల్భాలు పలుకుతున్నది. సివిల్ సూట్ వేసినా ప్రయోజనం అంతంతమాత్రమేనని న్యాయనిపుణులు వివరిస్తున్నారు. అదీగాక పోలవరం జాతీయ ప్రాజెక్టు. వాటిపై న్యాయపరిధి కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది.
గోదావరి జలాల వినియోగ హకులు తెలంగాణ, ఏపీలకు మాత్రమే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకూ ఉన్నాయి. అన్నింటితో ముడిపడిన వ్యవహారంలో వాటి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదీ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనమే చెప్పింది. అంటే ఆయా రాష్ర్టాలు సకాలంలో స్పందించాలి?, వాదనలను వినిపించాలి, అభిప్రాయాలు తెలుపాలి, వెరసి విచారణ ప్రక్రియ సుదీర్ఘ సమయం పట్టనున్నది. ఇదంతా జరిగే సమయంలో ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టును పూర్తి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని న్యాయనిపుణులు వివరిస్తున్నారు.