పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ 2020 సంవత్సరంలో వరదలకు దెబ్బతిన్నది. 3 చోట్ల ధ్వంసమైంది. అయినా కేంద్ర ప్రభుత్వం కిక్కురుమనలేదు. ఎన్డీఎస్ఏ నోరెత్తలేదు.
– 2022లో వరదలకు కాఫర్ డ్యామ్ దెబ్బతిన్నది. అయినా ఎన్డీఎస్ఏ బృందాలు వచ్చి తనిఖీ చేసింది లేదు, నివేదిక ఇచ్చింది లేదు.
శనివారం మరోసారి పోలవరం ప్రాజెక్టు అప్పర్ కాఫర్ డ్యామ్ కుంగిపోయింది. ముచ్చటగా మూడోసారి ధ్వంసమైనా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ మౌనవ్రతం పాటిస్తున్నాయి.
కాళేశ్వరంపై నానా రభస..కాళేశ్వరంలో కేవలం రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నానా యాగీ చేసింది. ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఏకంగా ప్రధాని సహా అందరూ గొంతు చించుకున్నారు. ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద వచ్చి ప్రాజెక్టే పనికిరాదన్నట్టు నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ పనితీరు గురించి తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ చాలు.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యామ్‌లో మరోసారి నాణ్యతా లోపం బయటపడింది. అప్పర్ కాఫర్ డ్యామ్ మరోసారి కుంగిపోయింది. దాదాపు 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతున ధ్వంసం అయినట్టు అధికారులు తెలిపారు. గతంలో 2022లోనూ ఇదేవిధంగా కాఫర్‌డ్యామ్ దెబ్బతిన్నది. అంతకుముందు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. అయినా ప్రాజెక్టు నాణ్యతపై ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంగానీ, ఇటు ఎన్డీఎస్ఏగానీ నోరు మెదకపోవడం గమనార్హం. వాస్తవానికి పోలవరం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టే అయినా సొంతంగా నిర్మించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులు చేస్తుండగా, కేంద్రం నిధుల సాయం చేస్తున్నది.
మళ్లీ కుంగిన కాఫర్ డ్యామ్
ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును చేపట్టింది. నిర్మాణ ప్రణాళికలో భాగంగా తొలుత గోదావరి ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన, దిగువన కాఫర్ డ్యామ్‌లు నిర్మించాల్సి ఉన్నది. ఆ తర్వాత ప్రధాన డ్యామ్, డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 28లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వీలుగా 2.1 కిలోమీటర్ల పొడవుతో, 31 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్‌డ్యామ్‌ను నిర్మించాలని ముందుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ తర్వాత దాని ఎత్తును 41.5 మీటర్లకు పెంచారు. అయితే అప్పర్ కాఫర్ డ్యామ్‌ను ఇష్టారాజ్యంగా నిర్మించారు. 2.1 కిలోమీటర్ల పొడవైన డ్యామ్‌లో ఒకచోట 380 మీటర్లు, మరోచోట 300 మీటర్ల గ్యాప్ వదిలారు. ఫలితంగా 2022లో వచ్చిన వరదలతో గ్యాప్ వదిలిన చోట్ల కాఫర్‌డ్యామ్ దెబ్బతిన్నది. ఆ తర్వాత కాఫర్‌డ్యామ్‌ను మరింత ఎత్తు పెంచారు. తాజాగా 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతున కాఫర్ డ్యామ్ ధ్వంసమైంది. నాణ్యత లోపం కారణంగా గతంలో దెబ్బతిన్న ప్రాంతంలోనే ఇప్పుడు కూడా కాఫర్‌డ్యామ్ దెబ్బతిన్నదని సమాచారం. ఈ రెండు సందర్భాల్లోనూ కేంద్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. ఎన్డీఎస్ఏ కనీసం వచ్చి, చూసి నాణ్యత లోపంపై ప్రశ్నించలేదు.
కొట్టుకుపోయిన డయాఫ్రం వాల్
ఏదైనా భారీ ప్రాజెక్టును కట్టేసమయంలో తొలుత వరద మళ్లింపు కోసం ఎగువ, దిగువన కాఫర్డ్యామ్లను నిర్మిస్తారు. ఆ తర్వాత డయాఫ్రం వాల్‌ను నిర్మిస్తారు. డ్యామ్‌లో నీరు నిల్వ ఉంచేందుకు, నీటి లీకేజీలను అరికట్టేందుకు, భారీ వరదల నుంచి డ్యామ్ పునాదిని పటిష్టంగా ఉంచడంలో డీ వాల్ అత్యంత కీలకమైనది. డీ వాల్‌ను నదిలోపల రాతిపొర నుంచి నదిపై భాగం బెడ్ లెవల్ వరకు నిర్మించాల్సి ఉంటుంది. డీవాల్ నిర్మాణం పూర్తయిన తర్వాతే మట్టి, రాతి కట్టను (ఈసీఆర్ఎఫ్) నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. పోలవరం డ్యామ్‌కు సంబంధించి డీ వాల్ నిర్మాణం చంద్రబాబు హయాంలో 2017లో చేపట్టారు. ఎగువన కాఫర్ డ్యామ్‌ను నిర్మించకుండానే దాదాపు రూ.600కోట్లతో, 1.396 మీటర్ల పొడవుతో, 1.5మీటర్ల వెడల్పు, నది అడుగుభాగంలోకి దాదాపు 90 మీటర్ల లోతుతో డీవాల్ నిర్మాణం చేపట్టారు. 2018 సంవత్సరం చివరినాటికే డీ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే 2020లో వచ్చిన గోదావరి భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ 3 చోట్ల దెబ్బతిన్నది. ఒక చోట 200మీటర్ల మేర వాల్ కొట్టుకుపోయింది. అనేక చోట్ల డీవాల్ ఇసుక కోతకు గురై అగాథాలు ఏర్పడ్డాయి. ఎగువన కాఫర్ డ్యామ్‌ను నిర్మించకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వం కిక్కురుమనలేదు. డీ వాల్ దెబ్బతినడంతో దాదాపు రూ.500కోట్ల నష్టం వాటిల్లింది. ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తద్వారా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.35వేల కోట్ల నుంచి రూ.55 వేల కోట్లకు పెరిగింది. పోలవరం డ్యామ్ భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఎన్డీఎస్ఏ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు గతంలో నిర్మించిన డీ వాల్‌కు 6మీటర్ల ఎగువన 1.47కిమీ పొడవుతో కొత్తగా మరో డీవాల్ను నిర్మించాలని, ఇందుకు రూ. వెయ్యి కోట్లు అవసరమవుతుందని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి.
మౌనం ఎందుకు?
కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై రాద్ధాంతం చేస్తున్న కేంద్రం, ఎన్డీఎస్ఏ నిపుణులు.. జాతీయ ప్రాజెక్టులో వరుసగా బయటపడుతున్న లోపాలపై మాత్రం నోరెత్తడం లేదు. ఎన్డీఎస్ఏ నిపుణులు వచ్చి ప్రాజెక్టును కనీసం పరీక్షించిన దాఖలాలు కూడా లేవు. నిబంధనలకు విరుద్ధంగా డీ వాల్ నిర్మించినా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కనిపించలేదు. కనీసం మందలించలేదు. నిర్మాణ లోపాల కారణంగా ప్రాజెక్టు వ్యయం రూ.20 వేల కోట్లకు పెరిగినా తప్పుగా అనిపించడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడుతున్నారు.