Andhajyothy | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆలు లేదు సూలు లేదు.. కొడుకు పేరు ఏదో అన్న చందంగా ఉన్నది అంధజ్యోతి తీరు. ధరపై తుది నిర్ణయం (రేట్ ఫైనల్) కాని టెండర్లలో గోల్మాల్ జరిగినట్టు ఒక్క అంధజ్యోతికి మాత్రమే కనిపించింది. ప్రభుత్వంపై విషం కక్కడమే లక్ష్యంగా అభూత కల్పనలకు వార్త రూపం ఇచ్చింది. ‘ధాన్యం టెండర్లలో గోల్మాల్’ అంటూ పతాక శీర్షికలతో విషపు రాతలను వండి వార్చింది. రేటుపై తుది నిర్ణయం వెలువడక ముందే, ప్రభుత్వం తక్కువ ధరకే ధాన్యం అమ్ముతున్నదని గగ్గొలు పెట్టింది. ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేసే కుట్రకు తెరతీసింది. తనకు అలవాటైన పద్ధతిలో ఊహాజనిత వార్తలతో ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కింది. రాష్ట్రం నుంచి బాయిల్డ్ బియ్యం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటున్నది. దీంతో గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుల్లో పేరుకుపోయింది. మరో రెండు నెలలైతే ఈ వానకాలం ధాన్యం వస్తుంది. ఈ ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రైతులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు 25 లక్షల టన్నుల పాత ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎలాంటి విమర్శలు, అవకతవలకు తావివ్వకుండా గ్లోబల్ టెండర్లను పిలిచింది. ఈ నెల 16న వేలం ప్రక్రియ పూర్తయింది.
అంధజ్యోతి రాసిన విషపు వార్తలో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే ధాన్యం అమ్ముతున్నదని గగ్గోలు పెట్టింది. వాస్తవం ఏంటంటే… టెండర్ ఫైనల్ ధరను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. బిడ్డింగ్‌లో పాల్గొన్న వ్యాపారులు వారికి గిట్టుబాబు అయ్యేరీతిలో క్వింటాలుకు కనీసంగా రూ.1,618 గరిష్ఠంగా రూ.1,732 గా కోట్ చేశారు. ఈ ధరలను ప్రభుత్వం ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ ఫైల్ ఇంకా పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వద్దకు కూడా చేరలేదు. మంత్రి స్థాయిలో చర్చించిన తర్వాత సీఎం వద్దకు ఫైల్ వెళ్లాలి. అప్పుడు సీఎం ఆమోదం తెలిపితే ధర ఫైనల్ అవుతుంది. ఫైల్ సీఎం వరకు వెళ్లేకన్నా ముందు అధికారులే బిడ్డర్లతో ధరపై చర్చలు జరుపుతారు. ఈ చర్చలు సఫలమైతే ముందుకు వెళతారు. కానీ ఇవేవీ జరగకుండానే బిడ్డర్లు కోట్ చేసిన ధరనే ఫైనల్ ధరగా అంధజ్యోతి నిర్ధారించేసింది. దీన్నిబట్టి ప్రభుత్వానికి రూ.1,500 కోట్లు నష్టం వస్తుందని తీర్మానించేసింది. వాస్తవానికి బిడ్డర్లు కోట్‌చేసిన ధరలపై ఇప్పటికే అధికారులు అంతర్గత సమావేశంలో చర్చించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపైనా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని చెప్పినప్పటికీ ఆరు నెలలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు ధాన్యాన్ని వేలం వేసిందంటూ మరో ఆరోపణ చేసింది. కానీ వాస్తవానికి అంతకు ముందు ఏడాది కూడా బాయిల్డ్ రైస్ తీసుకోబోమన్న కేంద్రం, ఆ తర్వాత కొంత మేరకు అవకాశం ఇచ్చింది. ఇదే రీతిలో గత ఏడాదికి కూడా కేంద్రం నుంచి అనుమతి కోసం అధికారులు ప్రయత్నం చేశారు. అందుకే ఆలస్యమైందని అధికారులు తెలిపారు.
ఇక అడ్డికి పావుశేరుకే అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మరో ఆరోపణ చేసింది. ధాన్యం విక్రయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో హైలెవల్ కమిటీని నియమించింది. ప్రభుత్వానికి తగిన ధర వచ్చేలా ఈ కమిటీ పర్యవేక్షిస్తున్నది.
మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పనటికీ ఇవ్వకుండా వేలం వేసిందంటూ అంధజ్యోతి ఆరోపణ చేసింది. ఒకవేళ ఆ పత్రిక చెప్పినట్టుగానే మిల్లర్లకు ధాన్యం కట్టబెడితే… ప్రతిపక్షాలతో కలిసి ‘ఏకపక్షంగా మిల్లర్లకు ధాన్యం కట్టబెట్టిన ప్రభుత్వం’ అంటూ అదే అంధజ్యోతి మరో కోణంలో విషపు రాతలు రాసేది. ఇలాంటి వాటికి చోటివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిబంధనల ప్రకారం టెండర్లను పిలిచింది.