జగిత్యాల కలెక్టరేట్, ఫిబ్రవరి 19: మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏండ్ల కారాగార శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి నీలిమ బుధవారం తీర్పునిచ్చారు.
సీఎంఎస్ ఎస్ఐ శ్రీకాంత్ వివరాల ప్రకా రం.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఎక్స్‌రోడ్డు ప్రాంతానికి చెందిన చెట్పెల్లి నారాయణ అలియాస్ టోపి నారాయణ అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలైన బాలికపై 2021 లో లైగింకదాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా.. పరిశీలించిన న్యాయమూర్తి నారాయణకు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు వెయ్యి జరిమానా విధిస్తూ, బాలికకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు. ఇన్స్పెక్టర్ రమణమూర్తి, సీఎంఎస్ఐ శ్రీకాంత్, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ సాగర్, సీఎంఎస్ కానిస్టేబుల్ రాజు, కిరణ్‌ను ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు.