జగద్గిరిగుట్ట,మే15: ఓ కామాంధుడు కూతురు వరుసయ్యే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన ఆ మైనర్‌పై తిరుపతిలోని జీఎస్టీ ఉద్యోగి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో నివాసముంటున్న ఓ మైనర్ (16) వేసవి సెలవుల నేపథ్యంలో ఏపీలోని తిరుపతి లక్ష్మీపురంలో నివాసముంటున్న తన పిన్ని ఇంటికి వెళ్లింది.
బాలిక పిన్ని భర్త, జీఎస్టీ ఉద్యోగి రామమూర్తి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వ్యక్తిగత ఫొటోలు సోషల్‌మీడియాలో పెడుతానని బాలికపై బెదిరింపులకు దిగుతూ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవలే తిరిగి జగద్గిరిగుట్టకు చేరుకొన్న బాలిక ప్రవర్తనలో వచ్చిన మార్పును ఆమె తల్లి గమనించింది. ఈ విషయమై బాలికను ప్రశ్నించగా జరిగిన దారుణాన్ని తల్లికి వివరించింది. ఆమె జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడు రామమూర్తిపై జీరో ఎఫ్ఐఆర్, పోక్సో కేసు నమోదు చేసి కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.