కోటపల్లి, జూలై 30 : మంచిర్యాల జిల్లా కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం అట్టెం అశోక్‌పై పోక్సో కేసు నమోదైనట్టు చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి ఎస్సై రాజేందర్ తెలిపారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని డీసీపీవో ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎం అశోక్ తమ పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నాడని, వేధింపులకు గురిచేస్తున్నాడని ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కగా ఆయన్ను ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ చేశారు. తమకు న్యాయం జరగలేదని, తమను వేధించిన హెచ్ఎంపై చర్యలు తీసుకోకుండా బదిలీ చేయడం ఏమిటని మరోసారి విద్యార్థినులు ధర్నా చేయడంతో సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపారు. విద్యార్థినుల తరఫున జిల్లా బాలబాలికల సంరక్షణ అధికారి ఆనంద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కేజీబీవీలో విద్యార్థినికి పాముకాటు
అలంపూర్ చౌరస్తా, జూలై 30 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ విద్యార్థిని పాముకాటుకు గురైంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామ శివారులోని కేజీబీవీలో మెన్నిపాడుకు చెందిన ద్రాక్షాయని 9వ తరగతి చదువుతున్నది. బుధవారం ఉదయం పాఠశాల ఆవరణలో ప్రా ర్థన చేసేందుకు నిల్చుండగా పాము కాటేసింది. దీంతో గట్టిగా కేకలు వేస్తూ అక్కడే కింద పడిపోయింది. తోటి విద్యార్థినులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయులు, తల్లి ఈశ్వరమ్మతో కలిసి ఏపీలోని కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే విజయుడు దవాఖానకు చేరుకొని విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.