మహబూబ్‌నగర్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి పోక్సో కేసు రిమాండ్ నిందితుడు గోడదూకి పరారైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిశోర్‌కుమార్‌రెడ్డి ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకెళ్లి పెండ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు మైనర్ అని.. మాయమాటలు చెప్పి పెండ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 10న పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్ అమ్మాయిని వనపర్తిలోని సఖి సెంటర్‌కు పంపించారు. కిశోర్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో 25 రోజుల నుంచి జిల్లా జైల్లోని క్యాంటీన్లో పని చేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున క్యాంటీన్ వెనుక భాగంపై ఉన్న బాత్రూమ్ ఎక్కి గోడదూకి పరారయ్యాడు.
జైల్లో ఉన్న తోటి ఖైదీల టవల్స్ సేకరించి ఒకదానికొకటి బిగించి గోడ అవతలివైపు వాటి సాయంతో కిందికి దిగి పరారయ్యాడని జైలు అధికారులు గుర్తించారు. జైలు నుంచి పరారైన నిందితుడు స్వగ్రామమైన నందిమల్లకు వెళ్లాడు.. అక్కడే రెండు గంటలపాటు ఉన్న కిశోర్‌ను కుటుంబసభ్యులు మందలించడంతో నేరుగా పొలానికి వెళ్లాడు. అప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తూ గ్రామానికి చేరుకున్నారు. దీంతో పొలంలో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు పొలంలో అపస్మారక స్థితిలో ఉన్న కిశోర్‌ను హుటాహుటిన వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు.. నిందితుడిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నదని, 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచుతున్నట్టు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.