హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రధాని రామగుండం పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలన్న కనీస మర్యాదను కేంద్ర ప్రభుత్వం, పీఎంవో పాటించకపోవడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ప్రధాని మోదీ ఈ నెల 12న రామగుండం ఫర్టిలైజర్స్ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి రావడం సంతోషకరమే కానీ.. ఆ కంపెనీలో యూరియాతోపాటు ఇతర ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి ప్రారంభమై ఏడాది దాటిందని వెల్లడించారు. మంత్రుల నివాస సముదాయంలో వినోద్‌కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధాని పర్యటనకు ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం కేంద్ర ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయాల కోసమే మోదీ రామగుండం వస్తున్నారని విమర్శించారు. ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదని కొందరు దుష్ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు.
మేడారం రైల్వే లైన్ ప్రకటించాలి
తెలంగాణలో పర్యటన సందర్భంగా ప్రధాని రామగుండం-భూపాలపల్లి-మేడారం-మణుగూరు రైల్వేలైన్‌ను ప్రకటించాలని వినోద్ కుమార్ కోరారు. 12న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న భద్రాచలం-సత్తుపల్లి రైల్వేలైన్‌కు అయిన మొత్తం రూ. 927.94 కోట్లు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి రూ. 618.55 కోట్ల్లు భరించిందని వినోద్‌కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్, తకెళ్ళపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రామచంద్రనాయక్, జీసీసీ చైర్మన్ వాల్యా నాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు.
జాతీయ రహదారులను మంజూరు చేయాలి
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావలసిన అన్ని జాతీయ రహదారులను రామగుండం పర్యటన సందర్భంగా ప్రకటించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావలసిన జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ.. దీనికి సంబంధించిన ఫైళ్లు ప్రధాన మంత్రి కార్యాలయంలో, నీతి ఆయోగ్ కార్యాలయంలో ములుగుతున్నాయన్నారు.
1)కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి – పిట్లం, (2) కరీంనగర్- వీణవంక- జమ్మికుంట-టేకుమట్ల-భూపాలపల్లి, (3) సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ-కథలాపూర్-కోరుట్ల, (4) సారపాక-మంగపేట-ఏటూరునాగారం-తుపాకుల గూడెం-కౌటాల, (5) హైదరాబాద్-సిద్దిపేట-కరీంనగర్-పెద్దపల్లి-రామగుండం ఈ జాతీయ రహదారులను అయినా రామగుండం పర్యటన సందర్భంగా ప్రకటించాలని వినోద్ కుమార్ ప్రధాని మోదీకి డిమాండ్ చేశారు.