హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ ఈ నెల 8న ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్రప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన అనిల్ స్వరూప్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
‘ఉత్తరాదికి చెందిన ఒక రాజకీయ నేత తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని ఈ నెల 8న ట్వీట్ చేశాను. దీనిని బట్టే కొందరు నేతలు వాస్తవాలను గ్రహించకుండా అడ్డగోలుగా విమర్శలు చేస్తారని తేలుతున్నది’ అని అనిల్ స్వరూప్ ఈ నెల 9న ట్వీట్ చేశారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో ప్రకటించింది. గత నెల 29న ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2017-18 నుంచి 2022-23 వరకు రాష్ర్టాల తలసరి ఆదాయాన్ని కేంద్రం వివరించింది. దీని ప్రకారం 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,08,732గా కేంద్రం పేర్కొన్నది.
ఈ వివరాలను ఉటంకిస్తూ అనిల్ స్వరూప్ ‘దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఘనత శ్రమజీవులైన రాష్ట్ర ప్రజలు, విజనరీ నాయకులు, సమర్థులైన అధికారులదే. ఇది భవిష్యత్తులో రాష్ట్ర లేదా దేశ అభివృద్ధికి రాజకీయ, సామాజిక, ఆర్థిక పాఠం అవుతుంది’ అని ట్వీట్ చేశారు. మోదీ విమర్శల నేపథ్యంలో మరోసారి ఆ ట్వీట్‌ను గుర్తు చేశారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలంటూ హితవు పలికారు.