హైదరాబాద్, డిసెంబర్ 19 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి, పర్యాటక రంగ బలోపేతానికి కీలకంగా మారిన జాతీయ రహదారి 365బీని పొడిగించాలని, మానేరు నదిపై రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జిని నిర్మించాలని ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర న్యూఢిల్లీలో శుక్రవారం ప్రధానమంత్రి మోదీని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
సూర్యాపేట నుంచి జనగామ, సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వరకూ నిర్మిస్తున్న జాతీయ రహదారి 365బీని ఎన్‌హెచ్ 63కి కలుపుతూ వేములవాడ-కోరుట్ల వరకూ పొడిగించాలని ప్రధాని మోదీకి ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఇదే జరిగితే, తెలంగాణ ఆర్థిక, సామాజికాభివృద్ధికి ఊతం లభిస్తుందని, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
365బీ జాతీయ రహదారి పొడిగింపునకు సంబంధించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనూ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతోపాటు హైదరాబాద్-కరీంనగర్ రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా మానేరు నదిపై రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు విషయాల్లో వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానిని కోరారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను కూడా బీఆర్ఎస్ ఎంపీలు కలిశారు.