బంజారాహిల్స్, జూలై 3: హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందిన అరుదైన బంగారు నాణేలతోపాటు నిజాం ఆభరణాలను వెనక్కి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిజాం మునిమనుమడు మీర్ హిమాయత్ అలీ మీర్జా కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు బంజారాహిల్స్‌లోని మాషాల్లా మంజిల్‌లో ఆదివారం ఆయన మీడియాకు వెల్లడించారు. అలీఖాన్ ఖజానాలో వేల కోట్ల విలువైన ఆభరణాలతోపాటు అతి పురాతన రెండు భారీ బంగారు నాణేలు ఉండేవని తెలిపారు. వాటి సమాచారం దొరకడం లేదని, స్విస్ బ్యాంకులో తనఖా పెట్టినట్లు వార్తలు వచ్చాయని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. నిజాం ఆభరణాలను హైదరాబాద్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానిసహా కేంద్ర మంత్రులంతా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా లేఖను రాసినట్టు చెప్పారు.