ఇదేమి మాయ? రెండు యూరియా బస్తాలు తీసుకున్న తొర్రూరు రైతు ముద్దసాని అనిల్ కుమార్ ఫోన్కు 18 బస్తాల యూరియా తీసుకున్నారంటూ వచ్చిన మెసేజ్
హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): పదవి కోసమో.. పనుల కోసమో పైరవీలు కామన్. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కోసం కూడా పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా యూరియాకు తీవ్ర కొరత ఏర్పడటంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘పంట అదును దాటిపోతున్నది. ఒక్కమాట చెప్పి నాలుగైదు బస్తాల యూరియా ఇప్పించండి’ అంటూ తమకు తెలిసిన నేతలను, అధికారులను, ఇతర ప్రముఖులను రైతులు బతిమాలుకుంటున్నారు. దీంతో దగ్గరివారైతే ఈ పైరవీ పనిచేసి నాలుగు బస్తాలు దొరుకుతున్నయి. లేదంటే రైతులకు ఆ పైరవీ కూడా పని చేయడం లేదు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యమేఈ దుస్థితికి కారణమనే విమర్శలొస్తున్నాయి.
‘ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకొనే సర్కారు.. అవసరమైన యూరియా కూడా అందించలేకపోతున్నదని రైతులు మండిపడుతున్నారు. యూరియా కోసం పైరవీలు ముఖ్యంగా గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జోరుగా జరుగుతున్నట్టు తెలిసింది. వచ్చిన లారీలో 25-30% బస్తాలు పైరవీలకు పోతున్నట్టు సమాచారం. పైరవీలు, పలుకుబడి ఉన్నవాళ్లకు యూరియా లభిస్తుంటే.. నిస్సహాయులైన రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ఇదే అదునుగా అధికారులు, ప్యాక్స్ ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుకాణాలు, గోదాముల ముందు పడిగాపులు కాస్తున్న రైతులు.. ఓపిక నశించి పలు చోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, మంచిర్యాల జిల్లా వెంకటాపూర్లో రైతులు రోడ్డెక్కినతీరు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది.
సగం కోత.. ఉన్నది 75 వేల టన్నులే
రాష్ట్రంలో రానున్న రోజుల్లోనూ రైతులకు యూరియా కష్టాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 75 వేల టన్నుల యూరియా మాత్రమే అం దుబాటులో ఉన్నది. ఇది వారం రోజులకు మాత్రమే సరిపోతుంది. ఇప్పట్లో స్టాక్ వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆగస్టులో అవసరమైన యూరియాకు, సరఫరా ప్రణాళికకు సంబంధమే లేకుండా పోయింది. ఆగస్టులో సుమారు 3.3 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, వ్యవసాయ శాఖ కేవలం 1.7 లక్షల టన్నుల సరఫరా కోసం ప్రణాళిక రూపొందించింది. అంటే సరఫరాలోనే 1.6 లక్షల టన్నులు కోత పెట్టడం గమనార్హం. పోనీ, ఆ ప్రణాళిక ప్రకారమైనా యూరియా సరఫరా అవుతున్నదా? అంటే అదీ అనుమానమే. ఇప్పటివరకు కేంద్రం నుంచి 68 వేల టన్నులు మాత్రమే వచ్చింది. సగం నెల గడిచినా సగం యూరియా కూడా రాకపోవడంతో కొరత మరింత పెరిగే అవకాశం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే, రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు సరిపడా యూరియా ఉన్నదని మార్క్ఫెడ్ వర్గాలు చెప్తున్నాయి. అసలు రాష్ట్రంలో యూరియా కొరతే లేదనేవిధంగా అధికారులు మాట్లాడటం గమనార్హం.