హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రామగుండంలోని ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి నిలిపివేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీచేయడంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. ముందస్తు ప్రణళికలతో ఇప్పటికే భారీ స్థాయిలో యూరియాను నిల్వ చేశామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో గత ఏడాది ఇదే సమయానికి 3.95 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉండగా.. ఈ ఏడాది 4.52 లక్షలు నిల్వచేసినట్టు వెల్లడించింది. ఈ నిల్వలను టీఎస్ మార్క్ఫెడ్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, కంపెనీ గోదాములు, డీలర్ల వద్ద నిల్వచేసినట్టు తెలిపింది. దీనికి అదనంగా జూన్ నెలకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.