నల్లగొండ : నిధులు పుష్కలంగా ఉన్నాయని పనులలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్లాలో చేపట్టిన నెల్లికల్లు లిఫ్ట్ పనుల పురోగతి పై ఆయన గురువారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌ను అరా తీశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహా సంతాప సభలో పాల్గొనేందుకు గాను గురువారం మధ్యాహ్నం సీఎం నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే.
అనంతరం ఆయన ఇటీవల నుడా(నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ )గా రూపాంతరం చెందిన నల్లగొండ పురపాలక సంఘం అభివృద్ధి పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. అనంతరం అక్కడే ఉన్న సాగర్ ఎమ్మెల్యే భగత్ తో మాట్లాడుతూ.. నెల్లికల్లు లిఫ్ట్, నందికొండ, హాలియా మున్సిపాలిటీల అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అందుకు ఎమ్మెల్యే భగత్ సమాధానమిస్తూ.. టెండర్లు పూర్తి అయ్యాయని పనులు త్వరలోనే మొదలు పెట్టనున్నట్లు వివరించారు.
అందుకు సీఎం కేసీఆర్ స్పందిస్తూ అటు నెల్లికల్లు లిఫ్ట్ కు ఇటు నందికొండ, హాలియా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు పుష్కలంగా ఉన్నాయని, పనుల్లో వేగాన్ని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.