హైదరాబాద్ : మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చేపట్టిన చెరువుల సుందరీకరణతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతినగర్ కాలనీ సమీపంలోని పెద్ద చెరువు సుందరీకరణ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో చెరువుల్లో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో చెరువులను సుందరీకరించే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. చెరువు పరిరక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా మార్నింగ్ వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్, యోగా కేంద్రం నెలకొల్పామని తెలిపారు. యువత కోసం చెరువు ప్రాంగణంలో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపామని త్వరలో నిధులు మంజూరవుతాయన్నారు.
రాత్రి సమయంలో వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా చెరువు చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. వినాయక, బతుకమ్మ నిమజ్జనాల కోసం చెరువు ప్రాంగణంలో కొలనును ఏర్పాటు చేశామని తెలిపారు. పెద్ద చెరువు రూపురేఖలు మార్చి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, బీఆర్ఎస్ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు, పోచబోయిన జగదీశ్‌యాదవ్, నాయకులు జక్కిడి రఘువీర్‌రెడ్డి, బాలరాజు గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, ఇరిగి రమేశ్, సిద్దగౌని జగదీశ్‌గౌడ్, రాజిరెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.