జగిత్యాల, జూలై 07 : పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అమృత్ మిత్ర కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా మొక్కలు నాటించే కార్యక్రమానికి (Women for Tree) శ్రీకారం చుట్టింది. అమ్మ పేరిట ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మాకా నామ్ పే)నినాదంతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా జగిత్యాల మున్సిపల్ పరిధిలో మెప్మా అధ్వర్యంలో రెండు స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేశారు. వీటి కోసం రెండు స్థలాలను పరిశీలించారు. జూన్ 5 నుంచి ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నారు.
పచ్చదనం క్రమేణ కనుమరుగవుతుండటంతో పట్టణ ప్రాంతాల్లో ఎండతీవ్రత అధికమవుతుంది. ముఖ్యంగా వేసవిలో వీచే వడగాలులతో జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సమస్యను గుర్తించిన కేంద్రం పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటాలని సంకల్పించింది. అమృతమిత్రలో భాగంగా మున్సిపల్ పరిధిలోని చెరువుల వద్ద ఉమెన్స్ ఫర్ ట్రీస్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం పట్టణ పరిధిలోని రెండు స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు, మోతె చెరువు కట్టలపై మొక్కలను నాటేందుకు నాలుగు గ్రూపులకు సంబంధించి 12 మంది సభ్యులను ఎంపిక చేశారు. వీరికి మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకోసం వారికి కొంత మొత్తం కూడా అందజేయనున్నారు. ఎంత నగదు చెల్లిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. చెరువు కట్టల వద్ద భారీ వృక్షాలుగా ఎదిగే తబిబుయా, వేప, రాగి, కదంబ, మర్రి వంటి వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షించనున్నారు. చెరువుల రక్షణతో పాటు మొక్కలను సంరక్షించి హరితవనాలుగా వాటిని తీర్చదిద్దనున్నారు.
జగిత్యాల జిల్లాలో పలు చెరువులను మొక్కలు నాటేందుకు ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలో చింతకుంట చెరువు, మోతె చెరువును ఎంపిక చేయగా, ప్రతి చెరువుకు రెండు స్వయం సహాయక సంఘాల నుంచి 6గురు చొప్పున 12 మందిని మొక్కల పర్యవేక్షణకు ఎంపిక చేశారు. అలాగే కోరుట్లలో తాళ్ళ చెరువును ఎంపిక చేసి సర్వర్ నగర్ స్వయం సహాయక సంఘం నుండి 10 మంది సభ్యులను ఎంపిక చేశారు. ధర్మపురిలో కరండ్లపల్లి చెరువు కోసం కరండ్లపల్లి స్వయం సహాయక సంఘాల నుండి 4గురు సభ్యులను ఎన్నుకున్నారు. మెట్పల్లి మున్సిపాలిటీలో పెద్ద చెరువును ఎంపిక చేసి వెంకటరావుపేట 4 స్వయం సహాయక సంఘాల నుండి 8 మంది సభ్యులను, రాయికల్ పెద్ద చెరువును ఎంపిక చేసి, కేశవనగర్ స్వయం సహాయక సంఘాంలోని 5 గురు సభ్యులను మొక్కల సంరక్షణకు ఎంపిక చేశారు. చెరువు కట్ట చుట్టూ మొక్కలు నాటేందుకు వీలుగా ఎంపిక చేసిన సంఘాల సభ్యులతో కలిసి స్థలాలను మెప్మా డీఎంసీ దుర్గపు శ్రీనివాస్ గౌడ్ ఇటీవల పరిశీలించారు. ప్రాంతాల్లోని బతుకమ్మ మాట్లను పరిశీలించి వాటిని ఎంపికచేశారు. రాష్ర ్టప్రభుత్వం నిర్వహించే వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జూన్ 5న ఈ మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆగస్టు 31వరకు గడువు విధించారు. నాటిన ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్ చేయనున్నారు. మొక్కల సంరక్షణ తీరును నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆన్లైన్ కాల్ ద్వారా పర్యవేక్షించనున్నారు. మొక్కలు నాటిన నుంచి వృక్షాలుగా ఎదిగేలా సంరక్షించాల్సిన బాధ్యత ఎంపిక చేసిన సంఘ సభ్యులపైనే ఉంటుంది.
అమృత్ మిత్ర 2.0లో భాగంగా స్వయం సహాయక సంఘం సభ్యుల ద్వారా మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని మెప్మా ఏఓ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందుకోసం మున్సిపల్ పరిధిలో ప్రాంతాలను గుర్తించడంతో పాటు మొక్కలు నాటే రెండు సంఘాల సభ్యులను ఎంపిక చేశాం. వారికి నీలంరంగు చీరలు, టోపి, పెన్ను, హ్యాండ్ బ్యాగ్, నోట్‌బుక్, వాటర్ బాటిల్‌తో కూడిన కిట్‌ను అందజేస్తాం. లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించేలా వాటికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఆయా సభ్యులతో స్థలాలను పరిశీలించాము. త్వరలోనే టార్గెట్‌ను పూర్తి చేస్తాం.