హైదరాబాద్, సెప్టెంబర్8 (నమస్తే తెలంగాణ) : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, ఆర్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ తదితరులతో జలసౌధలో సోమవారం ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమ్మకసాగర్ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ మేరకు 23న ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరై టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అందుకోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతోనూ చర్చించాలని సూచించారు. సీతమ్మసాగర్, మోడికుంట వాగు, చనాకా కొరాట డిస్ట్రిబ్యూటరీ సిస్టంతోపాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాలకు కావాల్సిన నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ ఉంటుందని, అదే సమయంలో జాతీయ సంస్థల సహకారంతో వరదలు తగ్గిన వెంటనే పనులు మొదలుపెట్టి, వచ్చే వానాకాలంలోగా పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణకు నిర్వహించతలబెట్టిన హెలిబోర్న్ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇరిగేషన్ శాఖలో ఇటీవల ప్రమోషన్లు పొందిన ఇంజినీర్లకు 14న జలసౌధలో అభినందనసభ ఏర్పాటు చేసినట్టు మంత్రి వెల్లడించారు.