హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషించేలా ఆశీర్వదించాలని వేంకటేశుడిని ప్రార్థించినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత వినోద్‌కుమార్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని, ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన ఉంచారని తెలిపారు.
కేసీఆర్‌తోనే దేశంలో పెనుమార్పులు
కేంద్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, నేటి పరిస్థితుల్లో కేసీఆర్ సుపరిపాలన దేశానికి అవసరమని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా అన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌తోనే దేశంలో పెనుమార్పులు సాధ్యమని చెప్పారు