Tirumala | హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారి ఆలయ సమీపంలో మళ్లీ విమానాలు ఎగరడం కలకలం రేపింది. అవి ఎక్కడివన్న దానిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు సమాచారం సేకరించే పనిలో పడ్డారు. నెలరోజుల సమయంలో మూడుసార్లు విమానాలు ఇలా ఆలయానికి సమీపం నుంచి వెళ్లడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆగమశాస్త్ర నియామావళి ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం నిషిద్ధం. గురువారం రెండు విమానాలు తిరుమల గగనతలంలోకి ప్రవేశించాయి.
ఓ విమానం ఆలయ గోపురం, గొల్ల మంటపానికి మధ్యలో నుంచి, మరొకటి ఆలయ సమీపంగా వెళ్లాయి. విమానాలు తిరుగడంపై గతంలోనే పలుమార్లు టీటీడీ అధికారులు కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపినా స్పందన రాలేదు. విశిష్ఠత కారణంగా తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్ పరిధిలోకి తేవాలని ప్రతిపాదించినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ భద్రతా సిబ్బందితో పహారా ఏర్పాటు చేసినా, గగనతలంలో మాత్రం సమస్యగా మారుతున్నది. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఆలయ సమీపంగా విమానాల రాకపోకలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.