
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎస్సీలకు రుణాల విడుదలను వేగవంతంగా పూర్తిచేయాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. 2020-21 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని సూచించా రు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపొందించాల్సిన ప్రణాళికపై మాసబ్‌ట్యాంక్‌లోని సంజీవయ్యభవన్లో అధికారులతో మంత్రి కొప్పుల శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. వృత్తి నైపుణ్యత లేని వాటిని ఈ నెలాఖరులోగా, వృత్తి నైపుణ్యానికి సంబంధించిన రుణాలను డిసెంబర్ చివరి నాటికి అందించాలని స్పష్టం చేశారు. దళితుల సంక్షేమం, ఉన్నతి, రుణ ప్రణాళిక అమలు, ఉపకార వేతనాలు, వసతి గృహాల నిర్వహణ, స్టడీ సర్కిళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దడం, ఎస్సీల సముద్ధరణ అంశాలపై ఈ నెలాఖరులో కలెక్టర్లతో చర్చిస్తామని వివరించారు. తన సొంత నియోజకవర్గం ధర్మపురిలో ఎస్సీ స్టడీ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ విద్యార్థులను తీర్చిదిద్దండి
మైనార్టీ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. మైనార్టీ గురుకులాల నిర్వహణ, వాటి పనితీరుపై అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. మైనార్టీలను ఉన్నతవిద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం సీఎం కేసీఆర్ 204 పాఠశాలలను ఏర్పాటుచేశారని, ఆంగ్లమాధ్యమంలో నాణ్య తా ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది 124 పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా ఆప్‌గ్రేడ్ చేశామని చెప్పారు. పాఠశాల ప్రగతి పేరిట ప్రతి శనివారం రెండు గంటలపాటు పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోయడం వంటి పనులు చేపట్టాలని సూచించారు.