హైదరాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం మంచినీటి చేపలకు కేరాఫ్‌గా మారిందని, వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నదని పలువురు మత్స్యరంగం నిపుణులు కొనియాడారు. రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి, విదేశాలకు ఎగుమతి చేసేందుకు అపారమైన అవకాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ కేరళలోని కొచ్చిలో మూడు రోజులపాటు పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర మత్స్యరంగ సాంకేతిక సంస్థ (షిఫ్ట్), చేపల ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడ), మత్స్య పాలన, యాజమాన్య శిక్షణా జాతీయ సంస్థ (నిఫ), మహిళా మత్స్యకారుల సహాయ సంస్థ (సాఫ్)కు చెందిన సాంకేతిక నిపుణులు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణ జలాశయాల్లో చేపలవేట కోసం ప్రత్యేకంగా సోలార్బోట్స్ను తయారుచేసేందుకు షిఫ్ట్ శాస్త్రవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ చేపలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఫిషరీస్ ఫెడరేషన్ చేసే ప్రయత్నాలకు తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని ఎంపెడ కార్యదర్శి డాక్టర్ ప్రదీప్ హామీ ఇచ్చారు.