ఫర్టిలైజర్సిటీ, ఆగస్టు 14 : సాంకేతిక కారణాలతో ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలోని అమ్మోనియో ప్లాంటులో గురువారం పైప్లైన్ లీకేజీ అయింది. దీంతో అమ్మోనియా ఉత్పత్తి నిలిచిపోయింది. పరోక్షంగా ఇది యూరియా ఉత్పత్తికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. రోజుకు కర్మాగారంలో 2,200 టన్నుల అమ్మోనియా, యూరియా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అయితే, కీలకమైన వానకాలంలో నాట్లు వేసే సమయంలో కర్మాగారంలో మొదట వార్షిక షట్డౌన్ కోసం మే 9 నుంచి జూన్ 14 వరకు 36 రోజులు ఉత్పత్తికి బ్రేక్ తీసుకున్నారు.
అనంతరం కర్మాగారం ప్రారంభం కాగానే జూలై 16 నుంచి ఆగస్టు 4 వరకు మళ్లీ అమ్మోనియా ప్లాంటులో లీకేజీతో 19 రోజుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. తిరిగి కర్మాగారం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఉత్పత్తి బ్రేక్ కావడం అధికారులను, ఉద్యోగులను కలవరపెడుతున్నది. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో రైతాంగం రోడ్డెక్కుతున్న సమయంలో ఉత్పత్తి బ్రేక్ కావడం ఆందోళన కలిగిస్తున్నది.