హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాజకీయ కారణాలతో మర్యాద హద్దులు దాటి భాషను ప్రయోగించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఏమాత్రం సమ్మతం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి డీఎల్ఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని విజయన్ వ్యతిరేకించారు. రేవంత్‌రెడ్డి ప్రసంగాలు, ఆయన చేసిన ట్వీట్లకు ఒకేసారి కౌంటర్ ఇచ్చారు. ఎస్డీజీ ఇండెక్స్‌లో కేరళ, తెలంగాణ స్థానాలను పోల్చారు. అనేక అంశాల్లో తెలంగాణ కన్నా కేరళ ముందు వరుసలో ఉన్నదని చురకలు అంటించారు.
నీతి ఆయోగ్ ఎస్డీజీ ఇండెక్స్ 2023-24లో కేరళ 79 పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకోవడాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఖాతాలో వేయడాన్ని విజయన్ తీవ్రంగా ఖండించారు. కేరళలో అధికారంలోకి వచ్చిన మొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ‘అగ్రారియన్ రిలేషన్స్ బిల్’ (వ్యవసాయ సంబంధాల బిల్లు)ను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన మొదటి దశాబ్దంలోనే కేరళలో భూస్వామ్య విధానాన్ని అంతం చేసినట్టు చెప్పారు. అయితే నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ అప్రజాస్వామికంగా కేరళ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినట్టు గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేరళ ప్రభుత్వం సమర్పించిన కొచ్చి మెట్రో, విళింజం పోర్ట్ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను విపరీతంగా ఆలస్యం చేశారని గుర్తు చేశారు. 1980 దశకంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేరళకు హామీ ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటికీ అలాగే మిగిలిపోయిందని తెలిపారు. 1993లో 73వ, 74వ రాజ్యాంగ సవరణలు రాకముందే, దశాబ్దాల కిందటే కేరళలోని మొదటి ప్రభుత్వం వికేంద్రీకృత పాలనా నిర్మాణాన్ని రూపొందించిందని చెప్పారు. 1980ల్లో కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ సారథ్యంలో అక్షరాస్యత ఉద్యమం జరిగిందని పేర్కొన్నారు.
1996లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం పీపుల్స్ ప్లానింగ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించి, పంచవర్ష ప్రణాళికలో మూడో వంతు కంటే ఎకువ నిధులను స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేయడం ద్వారా ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని చెప్పారు. 2016, 2021లో అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు నవ కేరళ మిషన్స్ ద్వారా సామాజిక వనరుల కల్పనలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పాయని చెప్పారు. ఆర్ద్రమ్ మిషన్ ద్వారా ప్రజారోగ్య రంగ రూపురేఖలు మార్చారని, పబ్లిక్ ఎడ్యుకేషన్ రెజువనేషన్ మిషన్ ద్వారా 13 వేల కంటే ఎకువ ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో మెరుగుపరిచామని వివరించారు. ఫలితంగా నీతి ఆయోగ్ కేరళను భారతదేశంలో అత్యంత తకువ అవినీతి ఉన్న రాష్ట్రంగా గుర్తించగా, తెలంగాణ 6వ అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా పేర్కొన్నదని ఎద్దేవా చేశారు. ఎస్డీజీ ఇండెక్స్‌లో కేరళ 79 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ 6వ స్థానంలో నిలిచిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ కేరళ మొదటి ర్యాంకును పొందిందని, పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా మారుతున్నదని చెప్పారు. 2025 నవంబర్ 1నాటికి దేశంలోనే అత్యంత పేదరికం లేని మొదటి, ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచిందని గుర్తు చేశారు.
కేరళలోని నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం స్వదేశంలోనే ఉన్నత అవకాశాలను సృష్టించే నాలెడ్జ్ ఎకానమీని నిర్మించడమే తమ విజన్ అని విజయన్ చెప్పారు. మేధో సంపత్తి, ప్రపంచ వాణిజ్యాన్ని భవిష్యత్తుకు పునాదులుగా చేస్తూ కేరళ ప్రస్తుతం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. 2026 ఐటీ పాలసీ ద్వారా, భారతదేశపు మొదటి డిజిటల్ సైన్స్ పార్, 20 వేల డీప్-టెక్ స్టార్టప్‌ల నెట్ వర్ సహకారంతో దేశ ఐటీ ఎగుమతుల్లో 10% వాటాను దకించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ డిజిటల్ విజయాలకు 16 వేల కోట్ల విలువైన విళింజం అంతర్జాతీయ ఓడరేవు వెన్నుముకగా ఉందని చెప్పారు. గ్లోబల్ ట్రాన్స్షిప్మెంట్ హబ్, డీప్-టెక్, ఏఐ, మారిటైమ్ లాజిస్టిక్స్‌లో నాయకత్వం వహించడం ద్వారా కేరళలోని నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం స్వదేశంలోనే ఉన్నత విలువైన అవకాశాలను సృష్టించే నాలెడ్జ్ ఎకానమీని నిర్మిస్తామని స్పష్టం చేశారు.
కేరళ పారిశ్రామిక రంగంపై రేవంత్‌రెడ్డి మూసపద్ధతిలో విమర్శలు చేశారని పేర్కొన్నారు. స్టార్టప్ రంగంలో కేరళ దూసుకుపోతున్నదని, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండెక్స్‌లో కూడా కేరళ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కేరళ నుంచి యువత విదేశాలకు వలస వెళ్లడాన్ని రేవంత్‌రెడ్డి విమర్శించగా, విజయన్ కౌంటర్ ఇచ్చారు. మళయాళీలు ప్రపంచంలోని అనేక దేశాల్లో పనిచేస్తూ భారతదేశానికి విదేశీ ద్రవ్యాన్ని పంపిస్తున్నారని, ఇది తమ ప్రభుత్వ విద్యావ్యవస్థ అందించిన నాణ్యమైన విద్యకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్డీయేతో విజయన్ అంటకాగుతున్నారన్న ఆరోపణలను సైతం ఖండించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కేరళపై తీవ్ర వివక్ష, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని చెప్పారు. రాజకీయ, ఆర్థిక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణిని ఎదురించడంతోపాటు బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి కేరళ ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ఇదొక్కటే కాదని ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై తాము కేంద్రంతో పోరాడుతున్నామని చెప్పారు. కాబట్టి వాస్తవాలు తెలుసుకోకుండా మర్యాద యొక్క హద్దులు దాటి మాట్లాడటమే బలమైన వైఖరికి నిదర్శనమన్న నమ్మకాన్ని విడిచిపెట్టాలని కోరారు.