కావాల్సిన ముఖ్యనేతలకు పంచిపెట్టి.. సోషల్ మీడియా పెయిడ్ టీములకు అందించి.. అనుకూల మీడియాకు లీక్ చేసి.. కథనాలు వండివార్చి.. మూడు రోజుల తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ప్రజలముందు ఉంచింది. 665 పేజీల పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మొత్తాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా.. కేవలం 60 పేజీలతో కూడిన ‘సెలెక్టెడ్’ పేరాలను ప్రభుత్వం విడుదల చేసింది. అందుకే అది కాంగ్రెస్ ఆత్మఘోష నివేదిక!
మూడేండ్లుగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలనే ఘోష్ కమిషన్ తన నివేదికలో కూరింది. ఎన్నికలకు ముందు రేవంత్ పదే పదే చెప్పిన విషయాలను వండివార్చిందే తప్ప.. ఒక్క కొత్త అంశాన్నీ బయటపెట్టలేదు. మహారాష్ట్ర సర్కారు ససేమిరా అన్న తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టలేదేమని బాధపడింది. నిర్మాణ స్థలాన్ని మేడిగడ్డకు ఎందుకు మార్చారని ఆవేదన వ్యక్తంచేసింది. తన పరిధి కాకపోయినా రాజకీయ వ్యాఖ్యలకు దిగడం.. కమిషన్ స్థాయిని దిగజార్చింది!
కేసీఆర్ సంకల్పానికి చెరగని సంతకం.. కాళేశ్వరం! బీటలు వారిన నేలకు నీళ్లిచ్చిన అపరభగీరథం.. కాళేశ్వరం! పడావు పడిన తెలంగాణ సాగును పచ్చగా మార్చిందీ, దేశానికే అన్నపూర్ణగా నిలిపిందీ.. కాళేశ్వరం! ఎవరు కాదన్నా.. కాళేశ్వరం ఫలాలు కండ్లముందున్నయ్. కటిక నిజాలు కనిపిస్తూనే ఉన్నయ్. గుడ్డి గువ్వలు ఏమైనా గొణగవచ్చుగాక.. గుడ్లగూబలు ఏదైనా భ్రమపడవచ్చుగాక! శ్రీకృష్ణ కమిషన్ కుట్రల్ని ఛేదించి, ప్రభుత్వాల మెడలు వంచి సాధించుకున్న తెలంగాణ ఇది! ఏ బనకచర్లను నిలబెట్టడం కోసం కాళేశ్వరాన్ని కూలుస్తున్నరో అర్థం చేసుకోలేనంత అమాయక సమాజం కాదిది! తెలంగాణ అన్నీ గమనిస్తున్నది. అర్థం చేసుకుంటున్నది!
చివరాఖరు: తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అన్నట్టు, కాంగ్రెస్ నేతల మాటలనే చిలకపలుకుల్లా వల్లె వేస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వేలకోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని కమిషన్ పేర్కొన్నది. మరి అంత ప్రజాధనం ఖర్చుచేసి కట్టిన ప్రాజెక్టు భవితవ్యమేందో.. బీడు భూములకు నీళ్లందాలంటే దాన్ని ఎలా సత్వరమే వినియోగంలోకి తేవాల్నో చెప్పే తెగువ, వివేకం కమిషన్ చూపించలేకపోయింది.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా ఉంది కాళేశ్వరంపై వేసిన పినాకీ చంద్ర ఘోష్ కమిటీ నివేదిక. దున్న ఈనిందని కాంగ్రెస్ అంటే, దూడను కట్టేయమని కమిషన్ చెప్పింది. రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు మూడున్నరేండ్లుగా చేస్తూ వచ్చిన ఆరోపణలకు కొన్ని రాజకీయ వ్యాఖ్యలను జోడించి నివేదిక సమర్పించినట్టుగా అర్థమవుతూనే ఉన్నది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ మూడురోజులక్రితం అందజేసిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మీడియాకు విడుదల చేసింది. అయితే మొత్తం 665 పేజీల నివేదికకుగాను.. తనకు అవసరమైన పేరాలు, అనుకూలమైన కామెంట్లను మాత్రమే తీసుకుని 60 పేజీల నివేదికను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలముందు ఉంచడం గమనార్హం. నివేదికలో తెలంగాణ గోస, నీటి అవసరాలు, ప్రజాకాంక్ష ఎక్కడా కనిపించలేదు. అలా అని సాంకేతిక అంశాలకూ పరిమితం కాలేదు. ఎంతసేపూ కాంగ్రెస్ ఇన్నాళ్లూ చేస్తూ వచ్చిన ఆరోపణలకు మించి ఒక్క కొత్త అభియోగమూ నివేదికలో లేదు. కేసీఆర్‌ని లక్ష్యంగా చేసుకునే రిపోర్ట్ అంతా సాగింది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిరంతరం పర్యవేక్షించడమూ తప్పేనట. అది కూడా రాజకీయ జోక్యమేనట. మరి ప్రభుత్వాధినేతలు ప్రాజెక్టులపై సమీక్షించవద్దా? చంద్రబాబో, రేవంతో చేస్తే ‘అడ్మినిస్ట్రేషన్’ అయినప్పుడు.. అదే పని కేసీఆర్ చేస్తే తప్పెలా అవుతుందనే లాజిక్‌ను ఘోష్ కమిషన్ మరిచిపోయినట్టుంది.
అసలు మూడున్నరేండ్లలో ప్రాజెక్టు పూర్తిచేయడంపైనా అనుమానాలు వ్యక్తంచేసింది. కమిషన్ తన నివేదికలో బాధ పడినదంతా.. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు ఎందుకు కట్టలేదనే! ప్రాజెక్టు స్థల మార్పిడికి, మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు విచారణకు సంబంధమేమిటో తెలియదు. తమ్మడిహట్టి వద్ద నీటి లభ్యత మీద ఎన్నిసార్లు ఎందరు లేఖలు రాశారు? అందులో ఏ లేఖ ముందు వచ్చింది? ఏ లేఖ ఆఖర్లో వచ్చింది? స్థల మార్పిడికి, ఆఖరుగా వచ్చిన లేఖకు ఉన్న సంబంధమేమిటి? అనేది పరిగణనలోకే తీసుకోలేదు. అదే రీతిలో నివేదిక చివర్లో ప్రాజెక్టు కోసం పనిచేసిన అధికారుల్లో కొందరి మీద చర్యలకు సిఫార్సు చేసి, కొందరిని ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించకుండా వదిలివేసిన తీరే నివేదికలో నిష్పాక్షికత లోపించిందని తేటతెల్లం చేస్తున్నది. నివేదికలోని అంశాలు ఎక్కువగా సాంకేతిక విషయాల చుట్టూనే ప్రదక్షిణలు చేశాయి తప్ప, తలెత్తి తెలంగాణ అంటే ఏమిటి? ఈ ప్రాంతానికి సాగునీటి అవసరం ఏమిటి? ఇక్కడ నీరు ఎంత విలువైనది? సాగునీరు లేక ఎన్ని లక్షల మంది వలసల బాట పడుతున్నారు? అనే ఏ ఒక్క అంశాన్నీ పట్టించుకోలేదు. అసలు ఆ నివేదిక ఆసాంతం ఓ తప్పుల తడక. రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక ఏమిటి? అందులో వారు చెప్పిందేమిటి? కమిషన్ నివేదికలో పేర్కొన్నదేమిటి? నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ చెప్పిందేమిటి? కమిషన్ నివేదిక చెప్తున్నదేమిటి? ఎక్కడా ఒక సమగ్రత లేదు. సత్యశోధన అసలే లేదు. గట్టిగా మాట్లాడితే నివేదికలో పేర్కొన్న అంశాలేవీ బలమైనవి కూడా కాదు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, నిర్మాణాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని అన్నది. అసలు రాజకీయజోక్యం అనేది ఏమిటి? ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాజెక్టు విషయమైనా ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకుంటాడు. ప్రజల ఆకాంక్షల మేరకు ఎక్కడ కట్టాలో.. రైతుల అవసరాలు, డిమాండ్లను బట్టి ఎంత స్టోరేజీ ఉండాలో ప్రభుత్వాధినేతగా ఆయనే నిర్ణయిస్తాడు. ప్రజలు ఆయనను ఎన్నుకునేది అందుకే. అంతేకాదు ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఏదో మార్గంలో ఆయనే సమకూర్చుతాడు. నిర్మాణాన్ని నిరంతరం సమీక్షిస్తాడు. అది సీఎం డ్యూటీ. ఆయన బాధ్యత. రాజ్యాంగ బద్దమైన విధి. దాన్ని రాజకీయ జోక్యం అనడం విచిత్రం. వాస్తవం చెప్పాలంటే.. నివేదిక ఆద్యంతం పూర్తి రాజకీయ వాసనలు కొడుతున్నది. అసలు కమిషన్ విచారణాంశాలేమిటి? మేడిగడ్డ ఎందుకు కుంగింది? ఎక్కడ లోపం జరిగింది? దీంతోపాటు మూడు బ్యారేజీల పరిస్థితి ఏమిటి? మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు, క్వాలిటీ కంట్రోల్, ప్లానింగ్ వంటి అంశాల మీద మాత్రమే విచారణ జరపాలి. కమిషన్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్‌లో ఎక్కడా తమ్మిడిహట్టి ప్రస్తావనే లేదు.
స్థల మార్పిడి కరెక్టేనా? విచారించమనీ అడగలేదు. అయినా కమిషన్ తన పరిధి దాటి దాన్ని ప్రస్తావించింది. మొత్తంగా ‘తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు?’ అని పరోక్షంగా ప్రశ్నించినట్టే ఉన్నది. దానికి ఉమాభారతి లేఖ, నిపుణుల కమిటీ నివేదిక అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఇంతేకాదు.. ప్రాజెక్టు స్థలమార్పిడీ తప్పేనట. అక్కడ బోలెడన్ని నీళ్లున్నాయట. ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదట. డీపీఆర్‌లు లేకుండా నిర్మాణం ప్రారంభించారట. ప్రాజెక్టు గిట్టుబాటు కాదట. ఇవన్నీ ఎక్కడో విన్న మాటల్లాగ అనిపించడం లేదూ? నిజమే. కొన్నేళ్లుగా కాంగ్రెస్, దాని ప్రాయోజిత మేధావులు, తెలంగాణ వ్యతిరేక మీడియా చెప్తూ వచ్చిందే. కొసమెరుపు ఏమిటంటే.. నిపుణుల కమిటీ సూచనలు ప్రస్తావిస్తూ ‘మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోలేక పోయిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి’.. అని సూచించడం ద్వారా తమ్మిడిహట్టి బొమికలను కమిషన్ బాహాటంగా మెడలో వేసుకున్నది కూడా! ఇంతా చేసి ఈ కమిషన్ విచారించిందేమిటి? ఏదీ దొరక్క కేసీఆర్ వేసిన ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక పట్టుకొని అందులోని అంశాలకు వక్రభాష్యం చెప్పి ఆ కమిటీ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చే ప్రయత్నం! రాజకీయ కక్షతో వేసిన కమిషన్ దానికి తగ్గట్టే రాజకీయ నివేదికను ఇచ్చింది.
కమిషన్ నింద: సీఎంగా కేసీఆర్ జోక్యం చేసుకున్నందుకే 3 బరాజ్‌ల నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండాల్సిన కేసీఆర్ ఒక అడ్మినిస్ట్రేటివ్
ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు.
అసలు నిజం: చంద్రబాబు చేస్తే అది తెలంగాణ కాంగ్రెస్‌కు గొప్ప. కేసీఆర్ చేస్తే అది తప్పు! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక సీఈవో అంటూ ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శిస్తున్న పత్రికలు గొప్పగా కీర్తించాయి. గొప్ప పరిపాలనాదక్షుడు అంటూ అక్షరాలతో పట్టం కట్టాయి. చివరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం చంద్రబాబు గొప్ప అడ్మినిస్ట్రేటర్ (పరిపాలనాదక్షుడు) అంటూ ప్రశంసలు కురిపించారు. మరి అదే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిత్యం పర్యవేక్షించి ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ పనిని మానిటరింగ్ చేస్తే అది రాజకీయ జోక్యం అవుతంది! అవును కాళేశ్వరం ప్రాజెక్టు కాన్సెప్ట్ కేసీఆర్‌దే. తెలంగాణ రైతులకు సాగునీరు అందించి, బీడు భూములను మాగాణిలా చేసిన ఘనత కేసీఆర్‌దే. ఆ జల సంకల్పం తీసుకున్నందునే ‘నా రైతులకు నీళ్లు కావాలి.. పైగా బరాజ్‌లలో నీటి నిల్వ ఉండి, ఏడాది పొడవునా జలకళతో గోదావరి నది తెలంగాణకు శ్రీరామరక్షలా ఉండాలి’ అనే ఒక కాన్సెప్ట్‌ను ఇంజినీర్లకు ఇచ్చారు. దానిపై సాధ్యాసాధ్యాలను నీటిపారుదల శాఖ ఇంజినీర్లు చూసుకున్నారు. కేంద్ర రంగ సంస్థ వ్యాప్కోస్‌తో అత్యాధునికమైన లైడార్ సర్వే చేయించారు. ఎల్అండ్టీ వంటి దిగ్గజ కంపెనీలకు టెండర్ల ద్వారా పనులు అప్పగించారు. కేసీఆర్ జల సంకల్పానికి అనుగుణంగా ప్రాజెక్టును చేపట్టడం సాంకేతికంగా సాధ్యమే అని ఇంజినీర్లు తేల్చిన తర్వాతే అందుకు కావాల్సిన నిధులు, అస్త్రశస్ర్తాలను ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ వారికి సమకూర్చారు. ఇందులో తప్పేమున్నది?
మూడు సంవత్సరాల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు సాంకేతికంగా బేరీజు వేసుకొని ఇచ్చిన కమిట్మెంట్ ఆధారంగానే కేసీఆర్ నిత్యం పర్యవేక్షణ చేశారు. నిర్మాణ సంస్థ ఏ సమయంలో ఎంత పని పూర్తి చేయాలనే జాబితాను ముందు ఉంచుకొని ఆ సమయంలో చెప్పిన పని పూర్తయిందా? కాకపోతే ఎందుకు కాలేదు? అంటూ నిద్రాహారాలు మాని పర్యవేక్షించారు. అందులో తప్పేమున్నది?
కమిషన్ నింద: తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనడంలో నిజాయితీ లేదు. అక్కడ నీటి లభ్యత లేదనేది నిజం కాదు. నీటి లభ్యత లేని కారణంగానే తమ్మిడిహట్టి దగ్గర నుంచి బరాజ్ నిర్మాణాన్ని మేడిగడ్డకు మార్చామనే సమర్థన తప్పుదోవ పట్టించేలా ఉన్నది.
అసలు నిజం: తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని ప్రజాక్షేత్రంలో నమ్మించేందుకు ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్ పెద్దల బాధను కమిషన్ భుజాన వేసుకున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదేండ్లు ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ్మిడిహట్టి దగ్గర చిన్న బరాజ్ కూడా కట్టకపోగా కనీసం మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకోలేకపోయింది. ఆ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కట్టలేదంటూ నిత్యం ఏడుస్తూనే ఉన్నది. దానికి అద్దం పట్టేలా తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనడంలో కేసీఆర్ ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరింలేదని కమిషన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాకపోతే ఆ మాట అన్నది కేసీఆర్ ప్రభుత్వం కాదు. సాక్షాత్తూ కేంద్ర జల సంఘం. అక్కడ నీటి లభ్యత ఉన్నదంటూ అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖ రాసిందని కూడా కమిషన్ పేర్కొన్నది. కానీ భారతదేశంలో నదీజలాల నీటి లభ్యత వంటి సాంకేతిక అంశాలను తేల్చాల్సింది కేంద్ర జల సంఘం. ఆ క్రమంలోనే 4.3.2015, 11.2.2015న కేంద్ర జల సంఘం తెలంగాణ నీటిపారుదల శాఖకు లేఖలు రాసింది. అందులో స్పష్టంగా ‘As evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75 percent dependability which includes perceived surpluses from the share of u/s states (i.e. assuming the utilization of u/s states limited to 75 percent availability) of 63 TMC. it is seen from the master plans of u/s states that the planned utilization are more than 75 percent availability as indicated below: As such the availability of surpluses from u/s states as estimated at barrage site may not be reliability available in future’ అని పేర్కొన్నది. అంటే తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం మళ్లించాలనుకున్న 160 టీఎంసీలకుగాను 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది. కానీ అందులో ఎగువన మహారాష్ట్ర హక్కుభుక్తంగా వాడుకోవాల్సిన 63 టీఎంసీలున్నాయి. భవిష్యత్తులో మహారాష్ట్ర ఆ నీటిని వాడుకుంటే తమ్మిడిహట్టి దగ్గర లోటు ఏర్పడుతుందని హెచ్చరించింది. అదేవిధంగా నీటి నిల్వ కూడా లేకపోవడం వల్ల సాగునీటి వినియోగంలో ఇబ్బందులు ఏర్పడతాయని స్పష్టం చేసింది. మరి బాధ్యతాయుతమైన కేంద్ర జల సంఘం హెచ్చరించినప్పుడు తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రమాదం పొంచి ఉన్న మార్గంలో వెళ్లాల్నా? ప్రత్యామ్నాయం చూసుకోవాల్నా? ఆ మాత్రం లాజిక్‌ను ఘోష్ కమిషన్ మిస్ అయితే ఎట్ల?
కమిషన్ నింద: తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేనట్టయితే మేడిగడ్డ వద్ద కూడా నీటి లభ్యత లేనట్టే. కేంద్ర జల సంఘం హైడ్రాలజీ నివేదిక ప్రకారం తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం చేపట్టకపోయినట్టే.. మేడిగడ్డ దగ్గర కూడా బరాజ్ నిర్మాణాన్ని చేపట్టవద్దు.
అసలు నిజం: తమ్మిడిహట్టి దగ్గర ఎంత నీటి లభ్యత ఉంటుందో మేడిగడ్డ దగ్గర కూడా అంతే ఉంటుందనే తర్క వాదన కొన్నేండ్లపాటు కేసీఆర్ వ్యతిరేకులు చేసిన విషయం తెలంగాణ సమాజం కండ్ల ముందున్నది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి నానా యాగీ చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూశారు. దురదృష్టమేందంటే జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా అవే మాటలను తన నివేదికలో వల్లె వేసింది. కేంద్ర జల సంఘం సూచన మేరకు తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేపట్టనందున అదే కారణంగా మేడిగడ్డ దగ్గర కూడా బరాజ్ నిర్మాణం చేపట్టవద్దని ఘోష్ తన రిపోర్టులో అభిప్రాయపడ్డారు. అంటే నీటిపారుదల శాఖ దగ్గర ఉన్న, తన కమిషన్ ముందుకు వచ్చిన డాక్యుమెంట్లను కూడా సక్రమంగా పరిశీలించకపోవడమా? లేదా ప్రభుత్వ పెద్దలను సంతృప్తిపరచాలనే కోణంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారోగానీ రెండుచోట్లా నీటి లభ్యతలో తేడా ఉన్నదనే వాస్తవాన్ని కమిషన్ విస్మరించింది. స్వయానా కేంద్ర జల సంఘమే ఈ సాంకేతిక అంశాన్ని ధ్రువీకరించింది. తమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా అందులో మహారాష్ట్ర వాటా 63 టీఎంసీలు ఉన్నదని చెప్పిన కేంద్ర జల సంఘం ఎగువ రాష్ర్టాల భవిష్యత్తు వినియోగాల ను మినహాయించినా మేడిగడ్డ దగ్గర 283.4 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని తేల్చింది. అందుకు అనుగుణంగా తమ్మిడిహట్టి దాటిన తర్వాత ప్రాణహితలోకి జలాలు కలుస్తాయనేది వాస్తవం.
కమిషన్ నింద: కేంద్ర జల సంఘం సూచన మేరకు కాంట్రాక్టు పనులను టర్న్‌కీ పద్ధతిలో చేపట్టలేదు. గంపగుత్త (లంప్సమ్) విధానంలో చేపట్టారు.
అసలు నిజం: బరాజ్‌ల నిర్మాణంలో కేంద్ర జల సంఘం సూచించినట్టుగా టర్న్‌కీ పద్ధతిలో కాకుండా గంపగుత్త (లంప్సమ్)గా టెండర్ల ప్రక్రియ చేపట్టారని ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. అసలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో టర్న్ కీ పద్ధతిలో టెండర్లు పిలవాలనే నిబంధన ఎక్కడైనా ఉన్నదా? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో భారీ ఎత్తున జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో చేపట్టింది. ఇదే కాంగ్రెస్ పెద్దలు గొప్పగా చెప్తున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును సైతం ఈపీసీలో చేపట్టి, అసలు తల లేకుండానే కాల్వల పేరిట వేల కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలను ప్రభుత్వ పెద్దలు మరిచినట్టున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఇంజినీర్లపై నమ్మకం ఉంచి, వారి నైపుణ్యాన్ని విశ్వాసంలోకి తీసుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క డిజైన్లు, ఎస్టిమేషన్లు అన్నింటినీ కాంట్రాక్టర్లకు అప్పగించకుండా ఇంజినీర్లకు అప్పగించింది. దానికి అనుగుణంగా చేపట్టాల్సిన పనులకు టెండర్లు పిలిచింది. అది ప్రభుత్వ విచక్షణ. అంతమాత్రాన అది అవినీతి ఎలా అవుతుంది?
కమిషన్ నింద: ప్రభుత్వ పూచీకత్తుతో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని రాష్ట్ర బడ్జెట్‌పై భారాన్ని మోపారు.
అసలు నిజం: కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే కాదు.. పదేండ్ల పాటు చేసిన అభివృద్ధిపై ఆది నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విమర్శలు.. లక్షల కోట్లు అప్పులు! ఘోష్ కమిషన్ కూడా అదే మైండ్‌సెట్‌తో విచారణ కొనసాగించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్ర ఖజానాపై భారాన్ని మోపారని కమిషన్ తన నివేదికలో పొందుపరిచింది. అదే నిజమైతే.. కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలు కూడా లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాయి. ఇదే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే లక్షల కోట్లు అప్పు చేసింది. కానీ ఏ ఒక్క ప్రాజెక్టును చేపట్టలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అప్పులు తెచ్చినా ప్రాజెక్టులు నిర్మించింది. మౌలిక వసతులు కల్పించింది. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై తెచ్చిన అప్పులను సై తం పెట్టుబడులుగా భావించింది. అందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బరాజ్‌లను ఎండబెట్టినా బాహుబలి మోటర్లు, అనంతసాగర్, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ రూపంలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తున్నది.
కమిషన్ నింద: కాంట్రాక్టు ఏజెన్సీలతో కుమ్మక్కై కాంట్రాక్టు గడువును (ఈవోటీ) పెంచడం అన్యాయం. ఇది సదరు ఏజెన్సీలకు మేలు చేయడానికే..
అసలు నిజం: మూడు బరాజ్‌ల నిర్మాణాల్లో కాంట్రాక్టు సంస్థలకు గడువు పెంచి కేసీఆర్ ప్రభుత్వం వారితో కుమ్మక్కయిందని ఘోష్ కమిషన్ విచిత్రమైన ఆరోపణ చేసింది. ఒకవైపు కేసీఆర్, హరీశ్‌రావు తొందరపెట్టడమే బరాజ్ కుంగుబాటుకు కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. అందుకు భిన్నంగా ఘోష్ కమిటీ కాంట్రాక్టు సంస్థలకు గడువు పెంచి కుమ్మక్కయిందని అంటున్నది. ఇందులో ఏది నిజం? పైగా మూడున్నర సంవత్సరాలకే గడువు పెంపుతో కుమ్మక్కయితే శ్రీశైలం సొరంగ నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో మొదలుపెట్టింది. ఇప్పటికే డజనుకుపైగా పర్యాయాలు గడువు పెంచారు. అంతేకాదు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నాలుగు దశాబ్దాలుగా నిర్మాణం కొనసాగింది. ఇలా చెప్పుకుంటూ పోతే జలయజ్ఞం కింద ఈపీసీ విధానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన ప్రాజెక్టుల్లో వేల కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని పదుల సంఖ్యలో గడువు పెంచిన ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. మరి ఘోష్ కమిషన్ సూత్రీకరణ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయినట్టేనా?
కమిషన్ నింద: బరాజ్‌లు అనేవి కేవలం నీటి డైవర్షన్ కోసమే. తక్కువ నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించాలి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ను అధిక నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. ఇది సాధారణ డిజైన్‌కు వ్యతిరేకం. కేవలం పబ్లిసిటీ కోసమే బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేశారు. పర్మియబుల్ ఫౌండేషన్‌పై నిర్మించడం వల్లనే బరాజ్‌లు కుంగిపోయాయి.
అసలు నిజం: దేశంలో 10 టీఎంసీలను మించిన నీటినిల్వ సామర్థ్యంతో కట్టిన బరాజ్‌లు చాలా ఉన్నాయి. ఇదేదీ సాధారణ డిజైన్‌కు వ్యతిరేకం కాదు. అన్నిచోట్లా అమలవుతున్నదే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే జూరాల బరాజ్‌ను 11 టీఎంసీలతో ప్రతిపాదించింది. భూసేకరణ చేయకపోవడం, అంతర్రాష్ట్ర సమస్యల కారణంగా ప్రస్తుతం 9 టీఎంసీలనే నింపుతున్నారు. మరెందుకు ఆనాడు ఎక్కువ సామర్థ్యంతో జూరాలను ప్రతిపాదించారు? అదీగాక గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించే వెసులుబాటు ఉన్న చోట బరాజ్‌లను తక్కువ సామర్థ్యంతో నిర్మిస్తారు. కానీ తెలంగాణ పరిస్థితి వేరు. నీటిని ఎత్తిపోసుకోవాలి. అందుకు నిర్ణీత లెవల్‌ను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నీటిని నిల్వ చేయడం తప్పనిసరి. అంతేకాదు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలను సీడబ్ల్యూసీకి సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌లో విపులంగా వివరించారు. బరాజ్‌ల నిర్మాణ డిజైన్లను కూడా ఇచ్చారు. సీడబ్ల్యూసీ కూడా వాటన్నింటినీ పరిశీలించి అనుమతిచ్చింది. మరి నీటినిల్వ సామర్థ్యంపై సీడబ్ల్యూసీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఎందుకు ప్రశ్నించలేదు? సాంకేతిక పరమైన అంశాల్లో సీడబ్ల్యూసీ కంటే మించి కమిషన్‌కు అనుభవమున్నదా? ఎండిన ప్రధానగోదావరి నిండుగా ఉండాలని, పునర్జుజ్జీవం పోయాలనే ప్రధాన ఉద్దేశంతోనే బరాజ్‌లను నిర్మించారు. మరి అలాంటప్పుడు నీరు నిల్వ చేయకుండా ఉంటారా? అది పబ్లిసిటీ ఎలా అవుతుంది? ఇక పర్మియబుల్ ఫౌండేషన్ వల్ల బరాజ్ కుంగిపోయిందనేది కూడా బరాజ్‌ల గురించి అవగాహన లేనివారు చేసే వాదనే. దేశంలో ఓఖ్లా, వజిరాబాద్, ఫరక్కా, కోటా, దుర్గాపూర్ తదితర అనేక బరాజ్‌లను కూడా అదేరకమైన పర్మియబుల్ ఫౌండేషన్ మీదనే నిర్మించారు. వాటిలో ఎలాంటి సమస్యలు రాలేదు. ఇకడ కూడా మేడిగడ్డలో ఒకే ఒక బ్లాక్‌లో 3 పియర్స్ క్రాక్ వచ్చాయి. మొత్తం బరాజ్‌కు ఏమీ కాలేదు. ఈ సీజన్లో కూడా వేలాది క్యూసెకులు ఈ బరాజ్ గుండానే దిగువకు పంపించారు. అయినా ఏమీ కాలేదు. ఈ అంశాన్ని మొత్తం ప్రాజెక్టుకు ఎలా అంటగడతారు?
కమిషన్ నింద: ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నెరవేర్చేందుకే నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు పని చేశారు. అక్రమాలకు ఆయన బాధ్యుడు.
అసలు నిజం: నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు కూడా రాజకీయంగా జోక్యం చేసుకున్నారని ఘోష్ కమిషన్ తన నివేదికలో చెప్పింది. ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా తన శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తెలంగాణ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు పనులను నిత్యం పర్యవేక్షించాల్సింది ఎవరు? ఇప్పుడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టు పనుల వద్దకు ఎందుకు వెళ్తున్నారు? సమీక్షలు ఎందుకు చేస్తున్నారు? ఇదంతా రాజకీయ జోక్యం అవుతుందా? కేసీఆర్ పర్యవేక్షణలో అప్పట్లో మంత్రిగా హరీశ్‌రావు రేయింబవళ్లు శ్రమించడం తెలంగాణ సమాజం అంతా చూసింది కదా? మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయా? లేదా? అని పర్యవేక్షించేందుకు హరీశ్‌రావు అర్ధరాత్రి కూడా అటవీ ప్రాంతంలో జరుగుతున్న పనుల వద్దకు వెళ్లారు. సొరంగంలో కావిటీస్ (మట్టి పొరలు) వచ్చి పనులు నిలిచిపోతే ఇతర రాష్ర్టాల నుంచి నిపుణులను పిలిపించి.. రోజుల తరబడి సొరంగంలోనే గడిపిన సందర్భాలు అనేకం. మంత్రిగా హరీశ్‌రావు ఏ అర్ధరాత్రి అయినా వస్తారని ఇంజినీర్లు కచ్చితంగా సైట్ల వద్ద ఉండి పనులను పర్యవేక్షించడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. తెలంగాణ రైతుల గోస తీర్చాలనే కేసీఆర్ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఒక సైనికుడిలా పని చేసినందునే కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలో పూర్తయి ఇప్పుడు బీడు భూములకు సాగునీరు అందిస్తున్నది.
కమిషన్ నింద: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 24.10.2014న హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినట్టు అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి 13.3.2015లో రాసిన తన లేఖలో పేర్కొన్నారు. అయినా నీటిపారుదల శాఖ అధికారులు 24.11.2014న సవరణ ప్రతిపాదనల్ని పంపారు.
అసలు నిజం: తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యతపై కేంద్ర జల సంఘం చేసిన హెచ్చరికను చాలా సీరియస్‌గా కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవడానికి వెనక చారిత్రక అనుభవం ఉన్నది. అందునా కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకమూ దాగి ఉన్నది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ గొప్పలు చెప్పుకొంటున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డిజైన్ ఏమిటి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు దశాబ్దాల దాని శిథిల ప్రస్థానమేంటనేది తెలంగాణ రైతాంగానికి తెలుసు. 102 టీఎంసీల నీటి నిల్వతో దాదాపు 156 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కోసం ఈ ప్రాజెక్టు చేపట్టారు. కానీ ఇప్పుడు దాని నిల్వ సామర్థ్యం కేవలం 80 టీఎంసీలు. మంచి ఇన్‌ఫ్లోలు ఉన్న సమయంలోనూ వినియోగం వంద టీఎంసీలు కూడా దాటడం లేదు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఆధునీకరించే వరకు కాకతీయ కాల్వలో 3-4 వేల క్యూసెక్కులు పారితే అదే పెద్ద విషయం. పైగా వరంగల్ దాటి కాకతీయ కాల్వ పారిన దాఖలాల్లేవు. అందుకే తమ్మిడిహట్టి రూపంలో తెలంగాణకు మరోసారి అలాంటి చేదు అనుభవం రాకూడదనే కేసీఆర్ కేంద్ర జల సంఘం సూచనతో బరాజ్ నిర్మాణ ప్రదేశాన్ని మార్చారు.
కమిషన్ నింద: బరాజ్ నిర్మాణాలకు సంబంధించి పరిపాలనాపరమైన ఆమోదాలు 2016లో ఇచ్చారు. కానీ కేంద జల సంఘం పరిశీలనకు ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) 2018లో సమర్పించారు.
అసలు నిజం: ఘోష్ కమిషన్ నివేదికలోని కొన్ని అంశాలు చాలా విడ్డూరంగా ఉన్నాయని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. 2016లో మేడిగడ్డ బరాజ్ నిర్మాణ పనులు మొదలైతే 2018లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించినట్టుగా ఘోష్ కమిషన్ తప్పుబట్టింది. కానీ వాస్తవమేందంటే ఏ రాష్ట్రమైనా చేపట్టే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఇదేరీతిన ఉంటుందనే సత్యాన్ని కమిషన్ విస్మరించింది. అందుకు ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగుగంగనే కాదు.. అనేక ప్రాజెక్టులు ఉదాహరణగా ఉన్నాయి. సాధారణంగా లైన్ ఎస్టిమేషన్ మీద టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టి ఆపై సమగ్ర నివేదికలను రూపొందిస్తారు. కారణం ఆయా ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టడమే. పైగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎంత వీలైతే అంత త్వరగా రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులను చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులంటే కనీసంగా రెండు, మూడు దశాబ్దాల పాటు పనులు కొనసాగడమనేది అనుభవంలో ఉన్నది. అందుకే ఆ అన్యాయాన్ని సరి చేసేందుకే కేసీఆర్ ప్రభుత్వం బరాజ్‌ల నిర్మాణ పనులను మొదలుపెట్టింది. ఆపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించింది. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాల లెక్క ఒక ప్రాజెక్టును కాగితాలు ఎక్కించేందుకు దశాబ్దం, పరిపాలనా ఆమోదం ఇచ్చేందుకు మరో దశాబ్దం, పనులు మొదలుపెట్టేందుకు ఇంకో దశాబ్దం.. ఇలా చేస్తే అది మంచి ప్రభుత్వమా? ఎలాంటి మంత్రివర్గ ఆమోదం, కనీసం అంచనాలు లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో మేస్త్రీని తీసుకుపోయి దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనుభవాలు తెలంగాణ సమాజం ముందు ఉన్నాయి కదా! అట్ల చేస్తే మంచిదా? నివేదికల పేరిట కాలయాపన చేయకుండా కేవలం మూడు సంవత్సరాల్లో తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాలనే తపనతో ముందుకు వెళ్లిన కేసీఆర్ ప్రభుత్వ సంకల్పం మంచిదా? ముఖ్యంగా 2018లో కేంద్ర జల సంఘం ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఆమోదించిన విషయాన్ని కమిషన్ విస్మరించింది.
కమిషన్ నింద: ప్రమాణాలకు విరుద్ధంగా సీడీవోతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లు తప్పుడు డిజైన్లతో ఎల్అండ్టీ, ఆఫ్కాన్స్, నవయుగ వంటి సంస్థలకు అక్రమ పద్ధతుల్లో లబ్ధి చేకూర్చారు. బ్యాంక్ గ్యారెంటీల్లో కుడా అవకతవకలు చోటు చేసుకున్నాయి. రాష్ర్టాన్ని ఆర్థికంగా తీవ్రంగా నష్ట పరిచింది.
అసలు నిజం : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత వ్యయం రూ.81,911 కోట్లు. ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి నాటికి ఖర్చు చేసింది రూ.93,872 కోట్లు మాత్రమే. అందులోనూ 2016 వరకు పీసీఎస్ఎస్ కోసం రూ.10,146.64 కోట్లను తీసివేస్తే నికరంగా బీఆర్ఎస్ చేసిన ఖర్చు రూ.83,725.36 కోట్లు మాత్రమే. ఇక మేడిగడ్డ బరాజ్ కోసం వెచ్చించిన రూ.3,348 కోట్లు మినహాయిస్తే ఇప్పటికీ 80,377.36 కోట్ల విలువైన ఆస్తులు
పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు వినియోగంలోనే ఉన్నాయి.
కమిషన్ నింద: కాళేశ్వరం ప్రాజెక్టును రూ.38.500 కోట్ల నుంచి 80 వేల కోట్లకు పెంచారు. ఆ తర్వాత దాన్ని 1.10 లక్షల కోట్లకు పెంచారు. ఇందులో భారీ అవినీతి జరిగింది.
అసలు నిజం: ప్రాజెక్టులు కట్టినప్పుడు అంచనా వ్యయం పెరగడం, వాటిని సవరించడం అత్యంత సాధారణం. అంచనాలను సవరించకుండా దేశంలో నిర్మితమైన ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. నిర్మించడం కూడా అసాధ్యం. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వమే చిన్నపాటి మోడికుంట వాగు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 139 కోట్ల నుంచి ఏకంగా రూ.724 కోట్లకు (దాదాపు 600 శాతం) పెంచింది. మరి దీనిలో కాంగ్రెస్ ఎంత అవినీతి చేసింది? ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను కూడా గాలివాటున పెంచలేదు. అనేక అదనపు నిర్మాణాలు, సామర్థ్యాలు పెరిగాయి కాబట్టి దానికి అనుగుణంగానే బడ్జెట్ అంచనాలు పెరిగాయి. అంతేతప్ప కొత్తదేమీ లేదు.
కమిషన్ నింద: కేసీఆర్ ప్రభుత్వం 2015లో జీవో 28 ద్వారా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బరాజ్‌ను వేమనపల్లిలో నిర్మించాలని సూచించింది. ఉద్దేశపూర్వకంగా ఆ నివేదికను దాచిపెట్టి మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించారు.
నిపుణుల కమిటీ రిపోర్టును పరిగణలోకి తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని కూడా కేసీఆర్, హరీశ్‌రావు ఎక్కడా వెల్లడించలేదు.
అసలు నిజం: 2015లో ఐదుగురు విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏరియల్ సర్వే చేసి 18 పేజీల రిపోర్టు సమర్పించింది. అందులో 7వ పేజీలో మేగగడ్డ వద్ద ఎలాంటి ముంపు లేకుండా 105 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మించవచ్చని చాలా స్పష్టంగా తెలిపింది. 8వ పేజీలో మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు జలాల తరలింపు అసాధ్యమని చెప్పింది. తాడిచర్ల బొగ్గుగనులు, సింగరేణి బొగ్గుగనులు, ఎన్టీపీసీ, అటవీప్రాంతం నేపథ్యంలో మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు జలాలను తరలించలేమని రిటైర్డ్ ఇంజినీర్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గోదావరి నది మీదుగానే జలాలను ఎల్లంపల్లి వరకు తరలించాలని నిర్ణయమైంది. అన్ని రిపోర్టులపై చర్చించి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని రిటైర్డ్ ఇంజినీర్లతో కూడిన నిపుణుల కమిటీ ఘోష్ కమిటీకి నేరుగా కలిసి కాళేశ్వరం నిర్వహణ మీద అఫిడవిట్ సమర్పించింది. దాని గురించి పూర్తిగా వివరించింది. ప్రాణహిత వద్ద నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ రాసిన లేఖల సంగతి కూడా తమ దృష్టిలో లేదని కూడా కమిషన్‌కు ఆ కమిటీయే లిఖితపూర్వంగా వివరించింది. దీనిపై కేసీఆర్, హరీశ్‌రావు స్పష్టతనివ్వలేదని కమిషన్ వ్యాఖ్యానించడం, తప్పుపట్టడమే విచిత్రం
కమిషన్ నింద: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బరాజ్‌లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం లేదు. ఇష్టారీతిన పనులను పెంచారు. క్యాబినెట్ ముందు పెట్టకుండా ఆర్డర్లు ఇచ్చేంతటి తొందర ఎందుకనేది తెలియదు.
అసలు నిజం: క్యాబినెట్ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించడంలో అర్థం లేదు. ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తుంది. ఆ తర్వాత క్యాబినెట్ ఆ ఉత్వర్వులకు ర్యాటిఫికేషన్ ఇస్తుంది. అంటే ఆమోదించడమే. ఇది ప్రభుత్వ కార్యకలాపాల్లో అతి సాధారణమైన ప్రక్రియ. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 5 సందర్భాల్లో క్యాబినెట్ ముందుకు వచ్చింది. దాన్ని నాటి క్యాబినెట్ ఆమోదించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గానికి సంబంధించి కొడంగల్ నారాయపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సైతం ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే తొలుత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత క్యాబినెట్లో ర్యాటిఫికేషన్ తీసుకున్నది. కొడంగల్‌కు ఇవ్వడం తప్పుకానప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇవ్వడం తప్పు ఎలా అవుతుంది? ఇక ఆర్డర్స్ ఇవ్వడంలో తొందర ఏమున్నదనేది కమిషన్‌కు కనిపించలేదనడం నిజమే. దశాబ్దాల తరబడి నీళ్ల కోసం ఎదురుచూస్తున్న ఆ తొందర ఏమిటనేది తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ సమాజం కోసం తపనపడిన కేసీఆర్‌కు తెలుసు. రైతులకు సత్వర ప్రయోజనాలను అందించాలనే తొందర తప్ప మరేమీ కాదు. తొందర పడకుంటే దశాబ్దాల పాటు పెండింగ్‌లో పెట్టాలా? ఏండ్ల పాటు నిర్మాణాలు కొనసాగాలా?
క్యాబినెట్ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించడంలో అర్థం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం 5 సందర్భాల్లో క్యాబినెట్ముందుకు వచ్చింది. దానిని అనాటి క్యాబినెట్ ఆమోదించింది.
సీఎం రేవంత్ సొంత నియోజకవర్గానికి సంబంధించి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్‌పై కాంగ్రెస్ సర్కారు తొలుత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్నే మంజూరు చేసింది. ఆ తరువాత క్యాబినెట్లో ర్యాటిఫికేషన్‌ను తీసుకున్నది.
కొడంగల్‌కు ఇవ్వడంతప్పుకానప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇవ్వడం తప్పు ఎలా అవుతుంది? ప్రతి చిన్న విషయంలో కేసీఆర్ రాజకీయ జోక్యం చేసుకున్నారని ఘోష్ కమిషన్ చెప్పింది.
ఒక సీఎం ప్రాజెక్టు నిర్మాణంలో జోక్యం చేసుకుంటే అది రాజకీయ జోక్యం ఎలా అవుతుంది? ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ పలు ప్రాజెక్టులపై అనేకసార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి వాటిని పరిశీలిస్తున్నారు. ఇదంతా రాజకీయ జోక్యమేనా? అదీ గాక రేవంత్ తాజాగా చెప్పినట్టు చంద్రబాబు జోక్యం చేసుకుంటేనేమో ఆయన గొప్ప పరిపాలకుడు. (సీఈవో, అడ్మినిస్ట్రేటర్). కేసీఆర్ సమీక్షిస్తేనేమో అది రాజకీయజోక్యం అంతేకదా!
‘బరాజ్‌లు అనేవి కేవలం నీటి డైవర్షన్ కోసమే. తక్కువ నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించాలి’ అని ఘోష్ కమిషన్ చేసిన వాదన పూర్తిగా అసంబద్ధం. దేశంలో 10 టీఎంసీలను మించిన నీటినిల్వ సామర్థ్యంతో కట్టిన బరాజ్‌లు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే జూరాల బరాజ్‌ను 11టీఎంసీలతో ప్రతిపాదించింది. అందులో ఇప్పుడు 9 టీఎంసీల నీళ్లు నింపి నిల్వచేస్తున్నారు.