హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): వివాదాలకు ఆస్కారం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని(ఆర్వోఆర్) త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తాము ప్రతిపాదించనున్న చట్టాన్ని ఇప్పటికే రెండు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నట్టు తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నూతన చట్టాన్ని రూపొందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉన్నదని, దానివల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ, భూ వివాదాలు లేకుండా చేసేందుకు, భూ వ్యవహారాల్లో పారదర్శకత తెచ్చేందుకే గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తెచ్చినట్టు చెప్పారు. దీన్ని రద్దుచేసి మళ్లీ దళారుల రాజ్యం తెస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తెలంగాణలో భూ హకులు – భూ సంసరణలపై శాసనసభలో చర్చను ప్రారంభిస్తూ, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను నిశితంగా విమర్శించారు. 2020 అక్టోబర్‌లో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులకు భూసమస్యలు మొదలయ్యాయని చెప్పారు. ఇది పూర్తిగా అవినీతితో కూడుకున్న చట్టమని, ఇద్దరు వ్యక్తులు కలిసి నాలుగు గోడల మధ్య కుట్రపూరితంగా దీన్ని రూపొందించారని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు, డాటా సెంటర్లు ఉన్నప్పటికీ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను సింగపూర్‌కు చెందిన కంపెనీకి అప్పగించారని విమర్శించారు. వీఆర్ఏ, వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడంతో 10,954 గ్రామాల్లో రెవెన్యూకు సంబంధించిన ఒక్క ఉద్యోగి కూడా లేకుండా పోయారని విమర్శించారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో సుమారు 18 లక్షల ఎకరాల భూముల వివరాలను చిన్నచిన్న కారణాలతో రికార్డులకు ఎకించకుండా పకన పెట్టారని ఆరోపించారు. ధరణి వల్ల తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది రైతులు బాధితులుగా మారారని తెలిపారు. ధరణికి సంబంధించి మొత్తం 2.45లక్షల దరఖాస్తులు రాగా, అందులో 1.18 లక్షల ఫిర్యాదులు ఇంకా పరిష్కరించాల్సి ఉందని, వచ్చే మూడు వారాల్లో వీటిని పరిష్కరిస్తామని చెప్పారు. భూసమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అద్భుతమైన చట్టం తెస్తున్నదని తెలిపారు.
ధరణి సమస్యలను పరిషరించేందుకు అధికారాలను వికేంద్రీకరించి, మండల స్థాయిలో తహసీల్దార్‌కు, డివిజన్ స్థాయిలో ఆర్డీవోలకు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు అధికారాన్ని అప్పగిస్తామని మంత్రి తెలిపారు. ధరఖాస్తు వచ్చినప్పటి నుంచి సమస్య పరిషారం అయ్యే వరకు ప్రతిదాన్ని కంప్యూటర్లో ఉంచుతామని, ఎవరైనా, ఎప్పుడైనా చూసుకొనే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ‘ఒకవేళ దరఖాస్తు తిరసరించాల్సి వస్తే దరఖాస్తుదారునికి ఆ కారణాలు వివరిస్తున్నాం. ప్రతి దరఖాస్తుపై నివేదికను తప్పనిసరి చేశాం. ధరణిని రైతు కోణంలో సంసరించాలని మా సరారు నిర్ణయించింది. కొత్త పథకం పూర్తిగా రైతు నేస్తంగా ఉండబోతున్నది’ అని తెలిపారు.
చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ను రూపొందించడం కోసం కేసీఆర్ నిర్వహించిన అనేక సమీక్షా సమావేశాల్లో పొంగులేటి కూడా పాల్గొన్నారని, అయినా కేసీఆర్‌పై, గత పాలనపైన విమర్శలు చేయడం సరికాదని అన్నారు. భూ వివాదాలను పరిష్కరించేందుకు నిజాంల కాలంనుంచి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వరకు అనేక సంస్కరణలను, చట్టాలను తెచ్చారని అయినప్పటికీ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. సింగపూర్ సహా అనేక అభివృద్ధి చెందిన దేశాలు ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్‌ను అమలుచేస్తున్నాయని, డిసెంబర్ 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.11,000 కోట్లతో భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని నిర్ణయించిందని తెలిపారు. అనేక రాష్ర్టాలు దీన్ని చేపట్టినప్పటికీ ఎక్కడా పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరగలేదని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు తదితర అనేకమందితో కేసీఆర్ చర్చించి భూవివాదాలు లేకుండా చూడాలనే లక్ష్యంతో ధరణిని ప్రవేశపెట్టారని చెప్పారు. ధరణి పేరును కూడా అందరితో మాట్లాడిన తరువాతే నిర్ణయించారన్నారు. ధరణిని కేసీఆర్ ప్రవేశపెట్టారనే ఉద్దేశంతోనే దాన్ని భూమాతగా మార్చాలని నిర్ణయించారని విమర్శించారు.
సింగపూర్‌కు చెందిన ఐటీ కంపెనీ చేతిలో పెట్టారని ఆరోపించడం సరికాదని పల్లా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఐటీ కంపెనీలు, డాటా సెంటర్ల వద్ద ప్రపంచమంతటికీ సంబంధించిన డాటా, అమెరికా రక్షణ వ్యవహారాల డాటా కూడా ఉంటుందని అన్నారు.
రెవెన్యూ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించినట్టు ముసాయిదా బిల్లుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్ఏ వెబ్సైట్లో (www.ccla.telangana. gov.in) అందుబాటులో ఉంచినట్టు భూపరిపాలన కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్ చట్టం ముసాయిదాను విడుదల చేసింది. 2020లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్వోఆర్ చట్టానికి బదులుగా కొత్తచట్టాన్ని తీసుకొస్తామని అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భూములకు భూధార్ నంబర్‌ను కేటాయించడం, దరఖాస్తులను తిరస్కరిస్తే అప్పీల్ చేసుకునే అవకాశం మినహా మిగతావన్నీ 2020 చట్టంలోని నిబంధనలనే కొనసాగించారు. ముసాయిదా ప్రకారం.. ప్రతి కమతానికి ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్‌ను కేటాయించనున్నారు. దీనిని ‘భూధార్’ అని పిలువనున్నారు. అక్షాంశ, రేఖాంశాలతో సరిహద్దులు, భూమి యజమాని వివరాలను పొందుపరుస్తారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములకు ప్రత్యేక సిరీస్‌తో భూదార్ నంబర్‌ను కేటాయిస్తారు. ప్రతి భూ యజమానికి ఆన్లైన్లో ఒక భూధార్ కార్డు తయారు చేస్తారు. ఇది ఆర్వోఆర్ పోర్టల్ (ధరణి)లో ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది.