హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ‘భార్యాపిల్లలతో కలిసి ఫంక్షన్‌కు వెళ్తున్న నాకు పంజాగుట్ట ఎస్ఐ శివశంకర్ ఫోన్ చేసి.. డీసీపీ సారు రమ్మంటున్నారు పది నిమిషాల్లో మాట్లాడి పంపిస్తామని చెప్పారు. ఈ నెల 15న రాత్రి 7.30 గంటలకు వెళ్లిన నన్ను అర్ధరాత్రి 1:30 వరకు విచారణ పేరిట చిత్రహింసలు పెట్టారు. టెర్రరిస్టు మాదిరిగా వ్యవహరించారు. హరీశ్‌రావు, మచ్చ వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలమివ్వకుంటే ఈ రాత్రికి రాత్రే లైఫ్ లేకుండా చేస్తామని బెదిరించారు..’ అంటూ ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితుడు టీ వంశీకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. హరీశ్‌రావు పేషీలో పనిచేశానని, రెండు, మూడుసార్లు ఆయనకు ఫోన్ చేశానని, సిద్దిపేట వాసిననే కారణంతో ఎైంక్వెరీకి పిలిచి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీకృష్ణ శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు తనతో వ్యవహరించిన తీరును ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.
భార్యాపిల్లలతో కలిసి వెళ్తున్నానని చెప్పినా వినలేదు..
‘ఫోన్‌ట్యాపింగ్ కేసులో పోలీసులు మొదటిసారి జనవరి 29న సాక్షిగా విచారణకు రమ్మని పిలిచారు. కోర్టు, రాజ్యాంగంపై నమ్మకమున్న వ్యక్తిగా వెళ్లి వారడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన. ఆ తర్వాత ఫిబ్రవరి 2, 3 తేదీల్లో పిలిస్తే వెళ్లిన. ఈ నెల 15న సాయంత్రం భార్యాపిల్లలతో కలిసి శుభకార్యానికి బంధువుల ఇంటికి వెళ్తుండగా పంజాగుట్ట ఎస్ఐ శివశంకర్ ఫోన్ చేసి డీసీపీ సార్ రమ్మంటున్నారు అని చెప్పారు. సార్ 10 నిమిషాల్లో మాట్లాడి పంపిస్తామని చెప్తే.. భార్యాబిడ్డలను వెంటబెట్టుకొని స్టేషన్‌కు వెళ్లిన.
హరీశ్‌రావు పేరు చెప్పకుంటే లైఫ్లేకుండా చేస్తామన్నారు..
రాత్రి 7:30 గంటలకు విచారణకు వెళ్లిన నాకు పోలీసులు నరకం చూపించారు. కేసుకు సంబంధంలేని విషయాలను అడిగారు. ముఖ్యంగా హరీశ్‌రావు, వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నేను చిరుద్యోగిని, నాకేం తెలియదని మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. మేం చెప్పినట్టు వింటే నీ ఉద్యోగం నువ్వు సాఫీగా చేసుకోవచ్చన్నారు. లేదంటే రాత్రికిరాత్రే లైఫ్ లేకుండా చేస్తాం’ అని బెదిరించారు.
బండ బూతులు తిట్టారు..
పోలీసులు నాతో అభ్యంతరకరంగా వ్యవహరించారు.. టెర్రరిస్టులు, తీవ్రవాదులను అడిగినట్టు ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా డీసీపీ విజయ్‌కుమార్ నా భార్యాపిల్లలను, తల్లితోపాటు చనిపోయిన నాన్నను కూడా వదలకుండా పచ్చి బూతులుతిట్టారు. హరీశ్‌రావు, వేణుగోపాల్ పేర్లు చెప్పాలని తీవ్రంగా హింసించారు. చెప్పినట్టు వినకుంటే అక్రమ కేసుల్లో ఇరికించి థర్డ్‌డిగ్రీ ప్రయోగిస్తామని బెదిరించారు.
పిల్లల డైపర్లు కూడా మార్చనివ్వలేదు..
ఆరున్నర గంటలపాటు ఏకబిగిన ప్రశ్నించారు. రెండు, మూడేండ్ల పిల్లలున్నారని, వారికి ఆకలేస్తుందని చెప్పినా వినకుండా విచారణ పేరిట వేధింపులకు గురిచేశారు. వదిలిపెట్టాలని నా భార్య రోదిస్తున్నా కనికరించలేదు. పిల్లలు మలమూత్ర విసర్జన చేశారని కనీసం డైపర్లు మార్చేందుకు సమయమివ్వాలని బతిమాలినా కరుణించలేదు. పోలీసుల తీరుతో ఆ అర్ధరాత్రి వేళ నరకం అనుభవించినం.
చక్రధర్‌గౌడ్‌తో ప్రాణహాని ఉన్నది..
ఈ కేసులో ఫిర్యాదుదారు చక్రధర్‌గౌడ్‌కు నేర చరిత్ర ఉన్నది. గతంలో ఆయన దగ్గర రెండు, మూడు నెలలు పనిచేసిన. ఆయన అక్రమ వ్యవహారాలు నచ్చకే ఉద్యోగం మానేసిన. జాబ్ పెట్టిస్తానని వందలాది యువతను మోసం చేసి చక్రధర్‌గౌడ్ కోట్లు సంపాదించారు. యువతులపై లైంగికదాడి చేయగా పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైనయ్. అలాంటి వ్యక్తిని పోలీసులు, ఈ ప్రభుత్వం సామాజిక సేవా కార్యకర్తగా చూపుతున్నది. అలాంటి నేరచరిత్ర ఉన్న వ్యక్తితో నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నది. సిద్దిపేటకు వెళ్లాలంటే భయమైతున్నది. నా కుటుంబానికి ఏమైనా జరిగితే పోలీసులు, చక్రధర్గౌడ్దే బాధ్యత.
రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తా..
ఎైంక్వెరీ పేరిట పోలీసులు నన్ను, నా భార్యాపిల్లలను తీవ్ర మనోవేదనకు గురిచేశారు. ఏనాడు కనీసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లని మా కుటుంబాన్ని రోడ్డుకిడ్చారు. మరణించిన మా నాన్నను కూడా వదిలిపెట్టకుండా కుటుంబసభ్యులందరినీ దుర్భాషలాడారు. విచారణ తీరు, తనతో పోలీసులు వ్యహరించిన వైఖరిపై రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తా. ఆయనైనా మా కుటుంబానికి న్యాయం చేస్తారని భావిస్తున్నా. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా.
28న అఫిడవిట్‌పై వాంగ్మూలం
నాంపల్లి క్రిమినల్ కోర్టులు: చక్రధర్‌గౌడ్ చేసిన మోసాల గురించి త్వరలో మీడియా సమక్షంలో బయటపెడతానని వంశీకృష్ణ స్పష్టం చేశారు. తాను సమర్పించిన అఫిడవిట్‌పై ఈ నెల 28న వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయనుందని, అన్ని విషయాలు కోర్టుకు వివ-రిస్తానని చెప్పారు. ఫోన్‌ట్యాపింగ్ చేసేంత స్థాయి తనకు లేదని, న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమయ్యానని అన్నారు. పోలీసులు పెట్టిన బాధల్ని కోర్టుకు వివరిస్తానని, వారిపై కఠిన చర్యలు చేపట్టేంత వరకు పోరాడుతానని చెప్పారు.